పుట్టగొడుగులు మాంసాహారమా లేక శాకాహారమా... ఎప్పటికీ తేలని తంతు ఇది. వాటిని తినే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు కాబట్టి అవి వెజ్, నాన్ వెజ్ అనుకున్నా పెద్దగా నష్టమేమీ లేదు. చాలా మంది ఆరోగ్య నిపుణులు పుట్టగొడుగులను తినమనే సిఫారసు చేస్తున్నారు. వీటిని తినడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మెదడు కణాలు క్షీణించినప్పుడు మతిమరుపు వచ్చే అవకాశం పెరుగుతుంది. మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. అందుకోసం సులువైన మార్గం పుట్టగొడుగులను ఆహారంలో అధికంగా తీసుకోవడం. 


రెండు సార్లు తిన్నాచాలు
వారానికి రెండుసార్లు కూర రూపంలోనో లేక పుట్టగొడుగుల పలావ్ రూపంలోనో... ఎలాగోలా పుట్టగొడుగులు పొట్టలోకి చేరేట్టు చూసుకోండి. ప్రతి సారి కచ్చితంగా 300 గ్రాముల పుట్టగొడుగులు తినండి. దీనివల్ల మతిమరుపు వచ్చే ఛాన్సు యాభైశాతం తగ్గిపోతుంది. అంతేకాదు పిల్లల్లో అయితే కొత్త భాష నేర్చుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మన శరీరం తనకు తానుగా ఉత్పత్తి చేసుకోలేని ఒక అరుదైన అమినోయాసిడ్ పుట్టగొడుగుల్లో ఉంటుందని,  వీటిని  తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు వైద్యులు. ఇంతేకాదు ఎన్నో వ్యాధులతో పోరాడే శక్తిని పుట్టగొడుగులు అందిస్తాయి. 


క్యాన్సర్ తో పోరాడుతుంది
పుట్టగొడుగులలో బటన్, ఓయస్టర్, పోర్టాబెల్లా మైటేక్ వంటి రకాల మష్రూమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో ముందుంటాయి. వీటిలో ఉండే లెంటినాన్ అనే షుగర్ మాలిక్యూల్ క్యాన్సర్ పేషెంట్లకు మేలు చేస్తుంది.  అలాగే లెంటినాన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుంది. లెంటినాన్ సాధారణ పుట్టగొడుగులలో కూడా లభిస్తుంది. 


అధిక బరువుకు చెక్
ఊబకాయంతో బాధపడేవారు తమ ఆహారంలో పుట్టగొడుగులను తరచూ ఉండేలా చూసుకోవాలి. ఇవి చెడుకొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీనివల్ల బరువు పెరగరు. బీపీతో బాధపడేవారికి పుట్టగొడుగులు చాలా మేలు చేస్తాయి. 


విటమిన్ డి అందించే ఆహారం
విటమిన్ డి అందించే ఆహారాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిలో పుట్టగొడుగులు ఒకటి. బటన్, క్రిమినిస్ రకం పుట్టగొడుగుల్లో విటమిన్ బి12తో పాటూ విటమిన్ డి లభిస్తుంది. అందుకే పుట్టగొడుగులను అందరూ కనీసం వారానికి రెండు సార్లయినా తినడం అలవాటు చేసుకోవాలి.


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?


Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?


Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి