మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో నిత్యం పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. అలా చాలా ఏళ్లుగా బట్టతల సమస్యపై కూడా పరిశోధకులు ఓ పరిష్కారాన్ని కనుక్కునేందుకు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికి బట్టతలను నివారించేందుకు ఓ ప్రోటీను జాడ తెలిసింది. దాని సాయంతో బట్ట తల రాకుండా నివారించడమే కాదు, బట్టతల వచ్చిన వారిలో కూడా తిరిగి జుట్టు మొలిచేలా చేయవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు హార్వర్డ్ పరిశోధకులు. 


ఎన్నో ఏళ్ల నుంచి బట్టతలకు ఓ శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టేందుకు ఎలుకలపై  విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఒక ప్రోటీన్ లోపం వల్ల ఇలా బట్టతల రావడం, జుట్టు ఊడిపోవడం జరుగుతోందని పరిశోధనలో తేలింది. ఒత్తిడి కలిగించే కార్టిసోల్ వంటి హార్మోన్ల కారణంగా ఆ ప్రోటీన్  అణిచివేయబడుతోందని, దీనివల్లే ఫోలికల్స్ (వెంట్రుకల కుదుళ్లు) దెబ్బతింటున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఏ ఏ ప్రోటీన్ లోపం వల్ల బట్టతల వస్తుందో, ఆ ప్రోటీన్ ను తిరిగి సరఫరా చేయగలిగితే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టేనని భావిస్తున్నారు.


ఏమిటా ప్రోటీన్?
జుట్టు పెరుగుదలకు సహకరించే ప్రోటీన్ ను GAS6 గా గుర్తించారు పరిశోధకులు. ఈ ప్రోటీన్ లోపం లేకుండా ఉండే బట్టతల సమస్య రాదని, ఈ ప్రోటీన్ జుట్టురాలడాన్ని నిరోధిస్తుందని, కొత్త వెంట్రుకల ఉత్పత్తికి సహాయపడుతుందని కనుగొన్నారు అధ్యయనకర్తలు. ఈ ప్రోటీన్ తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. శరీరంలో ఈ ప్రోటీన్ శాతాన్ని పెంచితే అది జుట్టు కుదుళ్ల డ్యామేజ్ ను కూడా తట్టుకుని, వెంట్రుకల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుందని హార్వర్డ్ లోని స్టెమ్ సెల్, రీజెనరేటివ్ బయాలజీ ప్రొఫెసర్ యా చీహ్ హ్సు వివరించారు. 


కోపం కూడా కారణమే
కేవలం ప్రోటీన్ లోపమే కాదు, మానసిక ఆందోళన, కోపం, ఒత్తిడి వంటి వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోయే సమస్య పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్  బారిన పడిన వారిలో కూడా జుట్టు రాలే సమస్య అధికంగా కనిపిస్తోంది. 


GAS6 ప్రోటీన్ క్రీమ్ రాబోతోందా?
పరిశోధనకర్తలు చెప్పినదాని ప్రకారం అంత త్వరగా ఈ క్రీమ్ ను తయారుచేయలేరు. ప్రస్తుతం ఎలుకలపై మాత్రమే పరిశోధన సాగింది. మానవులపై కూడా పరిశోధనా పూర్తవ్వాలి. దీనికి మరింత లోతైన అధ్యయనం అవసరం. ఆ తరువాతే ప్రోటీన్ ను క్రీమ్ రూపంలో తేవాలా లేక ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అన్నది ఆలోచిస్తారు. కానీ ఒక్కటి మాత్రం కచ్చితం... బట్టతల సమస్యకు పరిష్కారం మాత్రం సమీప భవిష్యత్తులో రాబోతోంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి