పుట్టగొడుగుల్లో ఎన్నో రకాలు. కానీ అన్నీ తినడానికి వీలైనవి కావు. వీటిలో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. అందుకే పుట్టగొడుగులు తినేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఏ పుట్టగొడుగులు తినవచ్చో, ఏ పుట్టగొడుగులు తినకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కథనంలో చికెన్ రుచిని గుర్తుకు తెచ్చే పుట్టగొడుగులను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి పేరు ‘లేటిఫోరస్ సల్య్వూరియస్’. ముద్దుగా వీటిని ‘చికెన్ ఆఫ్ ది వుడ్స్’ అని పిలుస్తారు. ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ఓక్ చెట్లపై ఇవి ఎక్కువగా పుడతాయి. అలాగే చెర్రీ, చెస్ట్‌నట్ చెట్లపై కూడా ఇవి కనిపిస్తాయి. ఇవి పూర్తిగా శాకాహారమైనవే. ఎందుకంటే కేవలం చెట్ల కొమ్మలపై మాత్రమే ఇవి పెరుగుతాయి. కాకపోతే వీటి రుచి మాత్రం కోడి మాంసంలా ఉంటుంది. చికెన్ కండ రుచి ఎలా ఉంటుందో అలాగే ఈ పుట్టగొడుగు కండ కూడా రుచిని అందిస్తుంది.
ఈ పుట్టగొడుగు గురించి 1789లో ఫ్రెంచ్ మైకాలజిస్ట్ పియర్ బులియా ప్రపంచానికి వివరించారు. దీనిని ‘చికెన్ మష్రూమ్’ అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క పుట్టగొడుగు రెండు నుండి 20 అంగుళాల వరకు పెరుగుతాయి. బరువు 45 కిలోల వరకు ఉంటుంది. దీనిలో ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇది చెక్క నుండి తయారయ్యే చికెన్‌గా చెప్పుకోవచ్చు కానీ, పూర్తి శాకాహారమే కాబట్టి ఎవరైనా తినవచ్చు.
డయాబెటిస్ ఉన్న వారికి ఈ పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యకరం. వీటిని తినడం వల్ల మధుమేహరోగులకు అంతా మేలే జరుగుతుంది. ఈ పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ లక్సణాలు అధికం. అలాటే హార్మోన్ల అసమతుల్యతను ఇది నయం చేస్తుంది. దంతాలు,చిగుళ్ల సంరక్షణకు ఇందులోని గుణాలు సాయం చేస్తాయి.
చికెన్ మష్రూమ్ పేరులో మాంసాహారం ఉన్నప్పటికీ, అవి పూర్తి శాకాహారమే అని వాదించే వాళ్లు ఉన్నారు. ఎందుకంటే ఇవి చెట్లపైన మాత్రమే పెరుగుతాయి. కానీ ఆ పెరిగే క్రమంలో చెట్లపై దొరికే సేంద్రియ పదార్థాలు తిని బతుకుతాయి. కాబట్టి వాటిని మాంసాహారంగానే పరిగణిస్తారు శాఖాహారులు. పుట్టగొడుగుల్లో అన్నీ రకాలు తినేందుకు వీలైనవి కావు. కొన్ని మాత్రమే తినే వీలు కలుగుతుంది. పుట్టగొడుగులు తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని ఇవి తగ్గిస్తాయి. వీటిలో ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి అవసరం అయినవే.
Also read: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.