నిద్రలేకపోవడం, అలసట, తీవ్ర ఒత్తిడి, ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇవే కాదు అలర్జీలు, డీహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా డార్క్ సర్కిల్స్ ని పెంచేస్తాయి. వీటిని వదిలించుకోవడానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడం, మార్కెట్లో దొరికే ఉత్పత్తులు రాసుకోవడం లేదంటే పర్మినెంట్ మేకప్ వంటివి చేయించుకుంటారు. అయితే వాటిని శాశ్వతంగా వదిలించుకోవడం కాస్త కష్టమే. కానీ వాటిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.


తగినంత నిద్ర: నిద్రలేకపోవడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు, సంచులు ఏర్పడతాయి. అందుకే తప్పనిసరిగా 7-8 గంటల పాటు నిద్రపోవడానికి ప్రయత్నించాలి.


హైడ్రేట్ గా ఉండాలి: నిర్జలీకరణం వల్ల చర్మం పేలవంగా కనిపిస్తుంది. నల్లటి వలయాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. రోజుకి కనీసం 8 గ్లాసుల నీటిని తాగడం మరచిపోవద్దు. అప్పుడే చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.


అలర్జీ: అలర్జీల వల్ల కళ్ళ చుట్టూ ఉబ్బడం, రంగు మారిపోవడం జరుగుతుంది. అటువంటి అలర్జీలు ఉంటే వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. అవసరమైన విధంగా యాంటిహిస్టామైన్ లు తీసుకోవాలి.


సూర్యరశ్మి నుంచి రక్షణ: అధిక సూర్యరశ్మి వల్ల కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది. నల్లటి వలయాలు మరింత ప్రస్పుటంగా కనిపిస్తాయి. చర్మాన్ని రక్షించుకోవడం కోసం 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.


కాస్మెటిక్ చికిత్స: నల్లటి వలయాలు తీవ్రంగా ఉంటే లేజర్ థెరపీ లేదా ఇంజెక్షన్ ఫిల్లర్లు వంటి కాస్మెటిక్ చికిత్సలు తీసుకోవచ్చు.


ఈ నల్లటి వలయాలు తాత్కాలికంగా మాత్రమే తొలగిపోతాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల వాటి రూపాన్ని తగ్గించుకోవచ్చు. అవి మరింత పెరగకుండా నిరోధించవచ్చు. ఇంట్లో దొరికే వాటితోనే డార్క్ సర్కిల్స్ పోగొట్టుకునేలా ప్రయత్నించవచ్చు.


కీరదోస: చల్లని కీరదోస ముక్కలు కళ్ళపై 10-15 నిమిషాల పాటు ఉంచండి. కళ్ళకి చాలా మంచిది. అందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి సహజ కాంతిని ఇస్తాయి. నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి.


టీ బ్యాగ్: ఆల్రెడీ ఉపయోగించిన టీ బ్యాగ్ చల్లగా అయిపోయిన తర్వాత కళ్ళపై 10-15 నిమిషాల పాటు పెట్టుకోవాలి. టీలోని కెఫీన్, యాంటి ఆక్సిడెంట్లు కళ్ళ చుట్టూ వాపు తగ్గించడంలో సహాయపడతాయి.


కోల్డ్ కంప్రెస్: వాపును తగ్గించి రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో కోల్డ్ కంప్రెస్ చక్కగా పని చేస్తుంది. చల్లని నీటిలో ముంచిన క్లాత్ ని కోల్డ్ కంప్రెస్ గా ఉపయోగించుకోవచ్చు.


బాదం నూనె: కొన్ని చుక్కల బాదం నూనె కళ్ళ కింద అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లాక్ సర్కిల్స్ ని తగ్గించి చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


టొమాటో రసం: టొమాటో రసం, నిమ్మరసం సమాన భాగాలుగా కలుపుకుని అందులో కాటన్ బాల్ ముంచి కంటి కింది భాగంలో అప్లై చేయాలి. దాన్ని 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. టొమాటో జ్యూస్ లో లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి వలయాలను తగ్గిస్తుంది.


రోజ్ వాటర్: రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్ నానబెట్టి వాటిని కళ్ళ మీద 15 నిమిషాల పాటు ఉంచాలి. రోజ్ వాటర్ చర్మానికి చల్లదనం ఇస్తుంది. కళ్ళ చుట్టూ ఉన్న వాపును తగ్గిస్తుంది.


ఈ నివారణలు అందరికీ ఒకే విధంగా పని చేయకపోవచ్చు. నిరంతరంగా డార్క్ సర్కిల్స్ వేధిస్తుంటే చర్మ నిపుణులుని సంప్రదించడం ముఖ్యం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?