సంతోషమే సగం బలం అంటారు. అన్ని రోగాలకు ఇది చక్కని పరిష్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, బాధ ఉంటుంది. అందుకే జీవితంలో కష్టసుఖాలు చెరిసమానమని అంటారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కష్టాలు ఎదురైనా కొంతమంది మొహం మీద చిరునవ్వు చెక్కుచెదరనివ్వరు. ఇదే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కూడా ఇదే మాట నమ్ముతారు. సంతోషంగా నవ్వుతూ ఉంటేనే ఎటువంటి పెద్ద సమస్య అయినా కూడా చిన్నదిగా కనిపిస్తుందని అంటారు. అందుకే ఆమె మోము మీద ఎప్పుడు చెరగని చిరునవ్వు ఉంటుంది.
సంతోషంగా ఉండటం మానవ హక్కు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఐక్యరాజ్యసమితి ఏటా మార్చి 20వ తేదీన 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్' అని ప్రకటించింది. జీవితం ఎంత విలువైనదో గుర్తుంచుకోవడం కోసం ఇది ఒక అద్భుతమైన రోజును ఐరాస పేర్కొంటుంది. 2011లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్థిక విషయాలతో సమానమైన ప్రాధాన్యతను ఆనందానికి కూడా ఇవ్వాలని పేర్కొంటూ సంతోషంగా ఉండటం ప్రాథమిక మానవ లక్ష్యంగా చెప్పింది. ఈ తీర్మానం ప్రవేశ పెట్టిన రెండు సంవత్సరాల తర్వాత 2013 లో యూఎన్లోని మొత్తం 193 సభ్యదేశాలు ప్రపంచంలోని మొదటి అంతర్జాతీయ సంతోష్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి మార్చి 20వ తేదీ ఇంటర్నేషనల్ హ్యపీ డే గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
సంతోషంగా ఉంటే ఏమవుతుందంటే..
- ఆనందం మీ రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది
- ఇతరులకు మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది ఆత్మ సంతృప్తి మిగులుతుంది
- సంతోషంగా ఉండేందుకు పూల సువాసనలు చక్కగా పని చేస్తాయి
- డబ్బు కంటే బంధాలు గొప్పవి, మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకోకుండా వాళ్ళతో సంతోషంగా గడపాలి
- ప్రకాశవంతమైన రంగులు మీ రోజులు ప్రకాశవంతం చేస్తాయి
- నొప్పులు, బాధని తగ్గించడంలో సహాయపడుతుంది
ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ అధ్యయనం బయటకి వచ్చింది. డబ్బుతో ఆనందాన్ని కొనలేరని చెప్తూ ఉంటారు. కానీ ఈ అధ్యయనం మాత్రం అది అబద్ధమని చెప్పుకొచ్చింది. డబ్బుతో ఆనందాన్ని కొనగలుగుతున్నారని అంటోంది. డబ్బు ఆనందాన్ని పెంచుతుందా లేదా అని అధ్యయనం చేశారు. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆనందం పెరుగుతుందని ఈ అధ్యయనం నిరూపించింది. ఎవరికైతే ఆదాయం ఎక్కువ వస్తుందో వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు తేలింది. అయితే ఇది అందరికీ సరిపోలకపోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు లేని వారిలో ఇది నిజమవుతుందేమో కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని మాత్రం సంతోషంగా ఉంచలేకపోవచ్చు.
నలుగురితో కలిసి ఉండటం, ఇష్టమైన సంగీతం వినడం వల్ల సంతోషంగా ఉంటారు. అందుకే చాలా మంది బాధగా అనిపించినప్పుడు నచ్చిన పాటలు వినడం, డాన్స్ చేయడం చేస్తారు. ఇది వారిలోని బాధని పోగొట్టి ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఏది ఏమైనా కుటుంబంతో కలిసి ఉంటూ నలుగురితో మాట కలుపుతూ మంచి అనిపించుకుంటే ఆనందమే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని కొందరు చెప్తారు.
Also Read: పెరుగు ఎప్పుడు తినాలో, ఎలా తినాలో తెలుసా?