డౌన్ సిండ్రోమ్ అనేది ఒక జన్యు సంబంధమైన వ్యాధి. పుట్టుకతోనే ఈ వ్యాధి వస్తుంది. ఇది వచ్చిన పిల్లలు మానసికంగా, శారీరకంగా వయసుకు తగ్గ పరిపక్వతను కలిగి ఉండరు. ఈ డౌన్ సిండ్రోమ్ బారిన పడిన పిల్లలు కొంతమంది సామాన్యంగా పాఠశాలలో చదువుకోగలిగినా, కొంతమందికి మాత్రం ప్రత్యేకమైన సౌకర్యాలు అవసరం పడతాయి. అది వారిలో డౌన్ సిండ్రోమ్ ఉన్నతీవ్రతని బట్టి నిర్ణయిస్తారు. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు పుట్టడం ఇప్పుడు సాధారణంగా మారింది. అమెరికాలో ప్రతి 1000 మంది పిల్లల్లో ఒకరికి ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. 


ఆయన పేరే...
డౌన్ సిండ్రోమ్ అనే పేరును బ్రిటిష్ వైద్యుడైన ‘జాన్ లాంగ్డన్ డౌన్’ పేరు మీద పెట్టారు. ఎందుకంటే ఇతనే 1866లో ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలు చెప్పగలిగాడు. అంతకుముందు కొంతమంది శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని గుర్తించినప్పటికీ, ఇది ఎందుకు వస్తుందో పూర్తిగా వివరించలేకపోయారు.


ఎందుకు వస్తుంది?
డౌన్  సిండ్రోమ్ అనేది పూర్తిగా జన్యు సంబంధమైన వ్యాధి. ప్రతి మనిషిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంటే మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రోటీన్, డిఎన్ఏ తో తయారవుతాయి. మన శరీరంలోని చర్మం, కళ్ళ రంగు, గుణగణాలు, స్వభావాలు, ఆకారం అన్నింటినీ నిర్ణయించేది ఇదే. అయితే కొంతమంది గర్భస్థ శిశువుల్లో వారి క్రోమోజోముల్లోని 21వ జతలో ఒక క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. అంటే రెండు ఉండాల్సిన చోట మూడు క్రోమోజోములు ఉంటాయి. అప్పుడు ఆ అదనపు క్రోమోజోమ్ బిడ్డల అసాధారణ ఎదుగుదలకు కారణం అవుతుంది. దీని ఫలితంగా శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. ఇలా డౌన్ సిండ్రోమ్‌తో మన దేశంలో ఏటా 13 లక్షల మంది జన్మిస్తున్నారని అంచనా. 


తల్లి వయసు 35 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంటే వారికి పుట్టే పిల్లలు ఇలా డౌన్ సిండ్రోమ్‌తో పుట్టే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అందరికీ ఇలా జరగాలని లేదు. ఇప్పుడు పుట్టకముందే తల్లి గర్భంలోనే డౌన్ సిండ్రోమ్‌ని గుర్తించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అల్ట్రాసౌండ్ పరీక్షలో గర్భస్థ శిశువు మెడ ఉబ్బినట్టుగా కనిపిస్తే డౌన్ సిండ్రోమ్ ఉందేమో అని వైద్యులు అనుమానిస్తారు. రక్తపరీక్ష ద్వారా ఉందో లేదో నిర్ధారిస్తారు. అప్పుడు ఆ గర్భాన్ని కొనసాగించాలా లేదా? అన్నది తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. ఎక్కువగా ఇలాంటి కేసుల్లో అబార్షన్ చేయించుకోమని సూచిస్తారు వైద్యులు. అయితే పుట్టబోయే పిల్లలకు డౌన్ సిండ్రోమ్ రాకుండా అడ్డుకునే చికిత్స మాత్రం ఇప్పటివరకు అందుబాటులో లేదు. 


డౌన్ సిండ్రోమ్‌తో పుట్టే పిల్లల్లో శారీరక సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారు. అలాగే పుట్టుకతోనే గుండె సమస్యలు, మూర్చ, థైరాయిడ్ వ్యాధులు వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. కొందరిలో లుకేమియా వంటి భయంకర రోగాలు కూడా ఉండొచ్చు. 




Also read: ఉగాది రోజున షడ్రుచుల పచ్చడిని ఎందుకు తినాలి? ఆ పచ్చడి వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు ఏంటి?
























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.