మే నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేసవిలో పెరుగుతున్న వేడి ఆస్తమా, శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇబ్బందులను తెస్తాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 339 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 400 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
ఉబ్బసం ఉన్న వ్యక్తులకు వడగాలులు సవాలుగా మారుతాయి. తీవ్రమైన వేడి ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల వాయు మార్గాలు సంకోచిస్తాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక రావడం, దగ్గు, ఛాతి బిగుతుగా పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే వేడి వాతావరణంలో ఓజోన్ వంటి పొరల్లో వాయు కాలుష్యాలు స్థాయి అధికంగా ఉంటుంది. ఇదే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
ఆస్తమా ఉన్నవారు వడగాలులు వేస్తున్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు ద్రవాహారాన్ని అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్‌హేలర్ ఎల్లవేళలా మీ వద్దే ఉంచుకోవాలి. బయట కాలుష్యం అధికమైపోతుంది. మండే ఎండల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా మాస్కుని ధరించాలి. కెఫీన్, ఆల్కహాల్ ఉన్న పానీయాలను తాగడం మానేయాలి. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల్లోపు బయటకు వెళ్లకపోవడమే మంచిది.
వీటిని తినాలి
ఆస్తమా ఉన్న వారు కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. అవి వారిలో అలెర్జీకి కారణమై ఆస్తమా వచ్చేలా చేస్తాయి. సాల్మన్ చేప, పాలు, నారింజ రసం, గుడ్లు, క్యారెట్, చిలగడ దుంపలు, ఆకుకూరలు, బ్రోకలీ, యాపిల్, గుమ్మడి గింజలు, డార్క్ చాక్లెట్ అధికంగా తినాలి.
తినకూడనివి
పుల్లగా ఉండే పదార్థాలు తినకూడదు. కీరా దోస, నిమ్మరసం, వైన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పొట్టలో గ్యాస్‌ను పెంచే ఆహారాలు తినకూడదు. బీన్స్, క్యాబేజీ, కార్బోనేట్ పానీయాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, వేయించిన ఆహారాలు వంటివి దూరం పెట్టాలి.
ఆస్తమా ఉన్న వారిలో తరచూ ఆయాసం వస్తుంది. గట్టిగా మాట్లాడినా కూడా వారికి ఆయాసం వచ్చేస్తుంది. అలాగే వారిలో దగ్గు అధికంగా వస్తుంది. ఛాతీ దగ్గర బిగుతుగా పట్టేసినట్టు అవుతుంది. వ్యాయామం చేయలేరు. కాసేపు చేసినా కూడా ఆయాసం వస్తుంది. తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం వంటివి జరుగుతాయి. గురక అధికంగా వస్తుంది. పిల్లికూతల్లాంటి శబ్ధాలు వస్తాయి. ఆస్తమా ఉన్న వారికి తరచూ జలుబు వస్తుంది.
Also read: చేపలు కచ్చితంగా తినాలని వైద్యులు చెప్పడానికి కారణాలు ఇవే
Also read: లాడా, ఇది టైప్ 1.5 డయాబెటిస్ - దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.