సిద్దాంత్ సూర్యవంశీ... హిందీ సీరియల్స్‌లో నటిస్తున్న ప్రముఖనటుడు. వయసు 46. జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. గుండె పోటు మరణించినట్టు చెప్పారు వైద్యులు. గతంలో బిగ్ బాస్ హిందీ విన్నర్ సిద్ధార్ద్ శుక్లా కూడా కేవలం 40 ఏళ్లకే అతిగా జిమ్ చేశాక గుండె పోటు మరణించాడు. ఇక కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం గురించి అందరికీ తెలిసిందే. వ్యాయామాలకూ గుండె పోటు మధ్య కనిపించని బంధం ఉన్నట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా కాస్త నలతగా ఉన్నప్పుడు చేయకూడని వర్కవుట్స్ చేయడం, అతిగా చేయడం కూడా గుండె పోటు రావడానికి కారణం అని తెలుస్తోంది. 


మంచిదే కానీ...
వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ దానికి పరిమితులు ఉన్నాయి. బరువు తగ్గడానికి, మంచి శరీరాకృతి కోసం అధికంగా వ్యాయామం చేస్తుంటారు ఎంతో మంది. అయితే అతిగా చేయడం వల్ల కలిగే ప్రతికూలతల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా, నీరసంగా అనిపించినా కూడా వ్యాయామం చేయకూడదు. జ్వరం వచ్చినప్పుడు వ్యాయామం చేయడం వల్ల శరీరం వేగంగా డీహైడ్రేట్ అవుతుంది. అంటే శరీరం నీరు అత్యంత వేగంగా కోల్పోతుంది.  దీని వల్ల జ్వరం తీవ్రం కావడంతో పాటూ ఇతర సమస్యలు వస్తాయి. అంతేకాదు జ్వరం ఉన్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల కండరాలను కూడా నీరసపరుస్తుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు జిమ్‌కి వెళ్లకూడదు. 


దగ్గు ఉంటే...
దగ్గును చాలా చిన్న సమస్యగా చూస్తారు. అందుకే దగ్గు ఉన్నప్పటికీ జిమ్‌కు వెళ్లిపోయే వారు చాలా ఎక్కువ. నిరంతర దగ్గు రావడం మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వ్యాయామం సరిగా చేయడలేక శరీరం తీవ్రంగా కష్టపడుతుంది. శరీరాన్ని అధికంగా కష్టపెట్టడం వల్ల ఒక్కోసారి గుండె నీరసిస్తుంది కూడా. 


పొట్ట సంబంధిత సమస్యలు
పొట్ట సంబంధిత సమస్యలు అంటే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఉన్న కూడా వ్యాయామాలు అతిగా చేయకూడదు. పొట్ట సమస్యలు శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. ఈ సమయంలో భారీ వర్కవుట్స్ చేయడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. నీరసంతో కుప్పకూలిపోవచ్చు. 


ఆరోగ్యం బాగోలేనప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ట్రెడ్‌మిల్ పై పరుగెత్తడం, బరువు ఎత్తడం వంటివి చేయడం వల్ల తీవ్ర సమస్యల బారిన పడవచ్చు. శరీరంపై అధిక ఒత్తిడిని మోపడం ద్వారా కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు పడుతాయి. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. జిమ్ చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరగడం, కండరాలకు రక్త ప్రవాహం అధికంగా మారి వేడెక్కిపోతుంది. దీని వల్ల  హృదయనాళ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. 


Also read: బెల్లం ఎన్ని రకాలో తెలుసా? వాటిలో ఏది మంచిదంటే

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.