ఎక్కిళ్లు రావడం, తగ్గడం ప్రతి ఒక్కరికీ జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఎంతసేపటికీ ఆగవు. చాలా చికాకును కలిగిస్తాయి. ఇవి చెప్పుకోవడానికి చిన్న సమస్యే అయినా చాలా అసౌకర్యంగా అనిపిస్తాయి.  వీటిని కొన్ని చిట్కాల ద్వారా వచ్చిన తరువాత ఆపవచ్చు. దీనివల్ల ఎక్కువ సేపు రాకుండా ఉంటాయి. 


ఎందుకు వస్తాయి?
ఇదొక శారీరక ప్రతిచర్య. దీనికి కారణం డయాఫ్రాగమ్. అంటే శ్వాస తీసుకోవడానికి సహాయపడే గొంతుకండరం. ఇది ఛాతీ భాగాన్ని, పొట్టను వేరుచేస్తూ ఒక పొరలా ఉంటుంది. ఈ పొర కదలిక వల్ల మనం గాలి లోపలికి పీల్చడం, బయటికి వదలడం చేయగలం. మనం గాలి పీల్చినప్పుడు లేదా ఏదైనా తిన్నప్పుడు ఒక్కోసారి ఇది మెలిపడుతుంది. అప్పుడు ఎక్కిళ్లు రావడం మొదలవుతుంది.  


ఎప్పుడు వస్తాయి?
ఎక్కిళ్లు ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టమే కాకపోతే ఏదైనా తినప్పుడు, తాగినప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ. 
1. గాభరాగా త్వరత్వరగా తినడం
2. కారంగా ఉండే ఆహారాలను తినడం
3. సోడాలు నిండిన కూల్ డ్రింకులు తాగడం
4. ఒత్తిడికి గురికావడం
5. మద్యం సేవించడం
ఈ పనుల వల్ల అధికంగా ఎక్కిల్లు వచ్చే అవకాశం ఉంది. 


ఎలా ఆపాలి?
ఎక్కిళ్లు ఆపే మందులు ఇంతవరకు కనుగొనలేదు. కాకపోతే కొన్ని చిట్కాలను మాత్రం చెబుతున్నారు. 


శ్వాస పద్ధతి
మీకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడల్లా, మీ శ్వాసను నెమ్మదిగా తీసుకోవడం ద్వారా లేదా ఎక్కువ గాలిని పీల్చి శ్వాసను 20-30 సెకన్ల పాటు బిగపట్టడం వల్ల ఎక్కిళ్లను నియంత్రించవచ్చు. ముందుకు వంగి చీట్ కంప్రెషన్ టెక్నిక్‌లను ప్రాక్టీసు చేయడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. ఇవన్నీ డయాఫ్రాగమ్ పై ఒత్తిడి తెచ్చి ఎక్కిళ్లు రాకుండా అడ్డుకుంటాయి. 


ఏదైనా తాగడం లేదా తినడం
కొన్ని ఆహారాలు లేదా పానీయాలు గొంతులోని నరానలు ఉత్తేజపరిచి ఎక్కిళ్లు ఆగిపోయేలా చేస్తాయి. చల్లటినీరు సిప్ చేయడం, ఉప్పునీరు పుక్కిలించడం, చక్కెర తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిమ్మ చెక్కపై ఉప్పు చల్లి ఆ నిమ్మచెక్క రసాన్ని కాస్త తాగాలి. అలాగే నాలికపై వెనిగర్ చుక్క వేసుకున్నా మంచిదే. 


మెడను రుద్దాలి
ఎక్కిళ్లను ఆపడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి గొంతు నరాలను ఉత్తేజపరిచేలా మెడను రుద్దడం. మరీ గట్టిగా రుద్దకండి. అది చాలా సున్నితమైన భాగం. ఎవరినైనా మెల్లగా మెడ వెనుక భాగంలో రుద్దమని అడగండి.


దృష్టి మరల్చాలి
ఈ పద్ధతినే మనం పూర్వీకుల నుంచి ఫాలో అవుతున్నాం. ఎక్కిళ్లు వస్తున్నాయని వాటి గురించే ఆలోచించకుండా ఇంకేదైనా పని మీద దృష్టి మరల్చుకోవాలి. ఏదైనా పనిచేసుకోవడం, బయటికి వెళ్లడం, తినడం, థ్రిల్లర్ మూవీ చూడడం ఇలాంటి పనులు చేస్తే అవే పోతాయి. 


Also read: బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదే, కానీ ఎక్కువ తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు


Also read: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే కొవ్వు కరగడం ఖాయం
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.