నోటికి కొంచెం పుల్లగా, మరి కొంచెం తియ్యగా ఉండే పండు కివీ. ఇంతకు ముందు ఈ పండు మనకు అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని ప్రాంతాల్లో సులభంగా లభిస్తోండి. కివి పండు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ కి పవర్ హౌస్ లాంటిది అని చెప్పవచ్చు. చల్లని దేశాలైన న్యూజిలాండ్, చిలీ, ఇటలీ గ్రీస్, అమెరికా వంటి ప్రదేశాల్లో కివీ పండుతుంది. ప్రస్తుతం మనకు లభిస్తున్న కివీ పండ్లు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. 


ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కివీలో ఫైబర్ అధికంగా ఉంది. విటమిన్లు A, B6, B12, E, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి బహుళ పోషకాలతో పాటు రక్త హీనతను నిరోధించగలిగే ఐరన్‌ను ఇది శరీరానికి అందిస్తుంది. అంతే కాదు తక్కువ కేలరీలని కలిగి ఉండే పండు ఇది. 70 గ్రాముల పండు సుమారు 40 కేలరీలను ఇస్తుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020-21 నుండి 2021-22 మధ్య భారతదేశంలో కివీపండ్ల దిగుమతి 49,483 MT నుండి 64,779 MTకి పెరిగింది. ఈ కాలంలో చిలీ కివీ పండ్ల ఎగుమతులు 50.08 శాతం పెరిగాయి. అంటే భారతీయులు కివీ మీద ఎంతగా మనసు పారేసుకున్నారో అర్థం అవుతుంది. ఇవి తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. గర్భిణీలకు కూడా ఏ పండు ఎంతో మేలు చేస్తుంది. 


ఫ్లూతో ఫైటింగ్


వర్షాకాలం వచ్చిందంటే ఫ్లూ, అనేక రకాల ఇన్ఫెక్షన్స్ సులభంగా అటాక్ చేస్తాయి. దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇటువంటి సమయంలో కివీ తీసుకోవడం వల్ల వాటి నుంచి రక్షణ పొందవచ్చు. కివీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజుకి ఒక కివీ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచేందుకు దోహదపడుతుంది. సెరోటోనిన్ ఉత్పత్తికి విటమిన్ సి కూడా చాలా ముఖ్యమైనది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి కివీ తీసుకోవచ్చు.


ఎలా తీసుకోవాలి


తొక్క తీసేయాల్సిన అవసరం లేకుండా రెండు భాగాలుగా కట్ చేసి లోపలి భాగాన్ని స్పూన్ తో తినొచ్చు. సలాడ్ లో జోడించి కూడా దీని తీసుకోవచ్చు. రెండు కివీలను ఒక కప్పు వెచ్చని, తియ్యని బాదం పాలు లేదా పెరుగుతో కలిపి నిద్రపోయే ముందు తీసుకోవచ్చు.


డెంగ్యూపై పోరాడుతోంది


పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్లేట్‌ లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. కివీ చాలా  సులభంగా జీర్ణమవుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్, పొటాషియం ఇందులో మెండుగా ఉంటాయి. డెంగ్యూని ఎదుర్కోడానికి బాగా పని చేస్తుంది. అటువంటి సమయంలో దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి 9 ను అందిస్తుంది.


గుండెకి మేలు


రక్తంలో కొవ్వు (ట్రైగ్లిజరైడ్స్) మొత్తాన్ని తగ్గించడానికి, గుండె, రక్త నాళాలను రక్షించడానికి  కివి ఉత్తమ ఎంపిక. విటమిన్ సి, పాలీఫెనాల్స్, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుండెని భద్రంగా ఉండేలా చేస్తుంది.


యాంటీఆక్సిడెంట్లు పుష్కలం


కివిలో అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒత్తిడి నుంచి బయట పడేలా చేస్తుంది. అందుకే గర్భిణీలకి ఈ పండు తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: మహమ్మారి ఇంకా పోలేదు,ప్రపంచంలో పద్నాలుగు కోట్ల మందికి లాంగ్ కోవిడ్ లక్షణాలు


Also read: పదహారు పిల్లల తల్లి, ఆమె జీవితంలో 14 ఏళ్లు గర్భవతే