ఇటీవల యునైటెడ్ స్టేట్స్ లోని వివిధ హైపర్ మార్కెట్ నుంచి ఫ్రీజ్ చేసిన స్ట్రాబెర్రీలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రీకాల్ చేసింది. అందుకు కారణం హెపటైటిస్ ఏ కేసులు ఎక్కువగా నమోదు కావడమేనని అక్కడి వార్తా పత్రికలు నివేదించాయి. ఈ వ్యాధి రావడానికి కారణం ఫ్రీజింగ్ చేసిన స్ట్రాబెర్రీలేనని తేలింది. కలుషితమైన స్ట్రాబెర్రీలు అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా పంపిణీ చేయబడ్డాయి. హెపటైటిస్ ఏ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. అలసట, జ్వరం, కామెర్లు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కలిగిస్తుంది. ఈ వైరస్ కలుషితమైన ఆహారం లేదా నీరు, అలాగే వైరస్ సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం వల్ల వ్యాప్తి చెందుతుంది.


కలుషితమైన ఫ్రీజింగ్ స్ట్రాబెర్రీలు రెస్టారెంట్లు, హోటళ్లు, వివిధ మార్కెట్లకి పంపిణీ చేయబడ్డాయి. వాటిలో వైరస్ అవశేషాలు ఉండటంతో అన్నింటినీ రీకాల్ చేసింది ఎఫ్ డీఏ. ఈ కలుషితమైన వాటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆహార నిర్వహణ, తయారీ ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. సరైన పరిశుభ్రత పద్ధతులు, కలుషితమైన వస్తువులని పూర్తిగా ఉడికించడం లేదా వేడి చేయడం చాలా కీలకం. ఇప్పటికే కొనుగోలు చేసిన వాళ్ళు వాటిని బాగా ఉడికించిన తర్వాత స్మూతీస్, సలాడ్ లో ఉపయోగించుకోవచ్చు.


హెపటైటిస్ ఏ నుంచి రక్షణ చిట్కాలు


హెపటైటిస్ ఏ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం తినడానికి ముందు బెర్రీలతో సహ తాజా ఉత్పత్తులని పూర్తిగా కడగడం మంచిది. ఇక ఫ్రీజింగ్ చేసిన స్ట్రాబెర్రీలు అయితే వాటిని తగిన ఉష్ణోగ్రత దగ్గర ఉడికించడం లేదా వేడి చేయడం వల్ల ఏదైనా కాలుష్య కారకాలు ఉంటే తొలగిపోతాయి.


హెపటైటిస్ ఏ లక్షణాలు


హెపటైటిస్ ఏ తీవ్రమైనది. వివిధ రకాల రక్త పరీక్షలతో గుర్తించవచ్చు. దీనికి సరైన మందులు లేవు. సాధారణంగా దానంతట అదే వెళ్ళిపోతుంది. క్రమం తప్పకుండా కాలేయ పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా హెపటైటిస్ ఐదు రకాలుగా ఉంటుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ. ఈ వ్యాధిని నివారించడానికి ఉన్న ముఖ్యమైన మార్గం తగినంత పరిశుభ్రత పాటించడం. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫెక్షన్లు, విషపూరిత పదార్థాలు వంటివి తీసుకోవడం వల్ల ఇది సంభవిస్తుంది.


ఈ వ్యాధి లక్షణాలు


☀అలసట


☀మలం రంగు మారడం


☀పొత్తి కడుపు నొప్పి


☀ఆకలి మందగించడం


☀అకస్మాత్తుగా బరువు తగ్గడం


☀పసుపు చర్మం, కళ్ళు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోకపోతే ఎముకలు విరిగిపోతాయ్, జాగ్రత్త!