Brain Health Tips: మానవ శరీరంలో ప్రధానమైన అవయవం మెదడు. మెదడు నుంచి వచ్చే ఆజ్ఞల ప్రకారమే మనిషి నడుచుకుంటాడు. అలాంటి మెదడు, మనిషి చేసే కొన్ని పొరపాట్ల కారణంగా దెబ్బతింటున్నది. బ్రెయిన్ యాక్టివ్ గా లేకపోతే, జీవితం మీదే పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత ఉండకపోవడం, మానసిక అలసట లాంటి సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బ్రెయిన్ యాక్టివ్ గా ఉండేందుకు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫోన్ వాడకం తగ్గించండి


మెదడు ఆరోగ్యాన్ని దెబ్బ తీసే వాటిలో సెల్ ఫోన్ ఒకటి. ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. రాత్రి పూట ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల మానసిక సమస్యలకు కారణం అవుతుంది. రాత్రి పూట ఫోన్ వాడకపోవడం మంచిది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.


జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి


ప్రాసెస్ చేసిన ఫుడ్, షుగరీ ఫుడ్, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే జంక్ ఫుడ్ మెదడు పని తీరును దెబ్బ తీస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తీసుకోవడం మంచిది. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెదడు కణాల వృద్ధిని పెంచడంతో పాటు ఏకాగ్రతను పెంచుతాయి.


స్మోకింగ్, డ్రింకింగ్ మానేయండి


ధూమపానం, మద్యపానం మెదడు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. నికోటిన్ రక్త నాళాల్లో పేరుకుపోయి మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ మెదడు కణాలను దెబ్బతీస్తుంది. న్యూరోట్రాన్స్ మీటర్ పని తీరుకు అంతరాయం కలిగిస్తుంది. స్మోకింగ్, డ్రింకింగ్ కు దూరంగా ఉండటం వల్ల న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ముప్పు నుంచి కాపాడుకోవచ్చు.


ఒత్తిని తగ్గించుకోండి


ఒత్తిడి, ఆందోళన కారణంగా కార్టిసాల్ స్థాయిలు పెరిగి మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలక్రమేణా మెదడు కణాలను నాశనం చేస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెడిటేషన్, యోగా ద్వారా మెదడును కూల్ గా ఉంచుకోవాలి.   


ఒంటరితనాన్ని వదులుకోండి


ఒంటరితనంగా ఫీలవడం వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటుంది. ఒంటరి తనంతో మెదడును మొద్దుబారుతుంది. ఒంటరిగా ఫీలైనప్పుడు ఫ్రెండ్స్ తో సరదాగా గడపాలి.


మెదడు పని తీరును పెంచే పజిల్స్ ఆడండి


బ్రెయిన్ షార్పుగా పని చేసేందుకు  పజిల్స్ ఆడటం మంచిది. కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, చదవడం, రాయడం, సంగీతం వినడం లాంటివి చేయడం వల్ల మెదడు యాక్టివ్ గా ఉంటుంది. పజిల్ గేమ్స్ వల్ల నాడీ వ్యవస్థ బలోపేతం అవుతాయి. 


శారీరక శ్రమ అవసరం


మెదడు చురుగ్గా పని చేయాలంటే శారీరక శ్రమ అవసరం. గంటలు గంటలు కూర్చొని పని చేసే వాళ్లు కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. లేదంటే మెదడు పని తీరు మందగిస్తుంది. శారీరక శ్రమ అనేది మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. మెదడు యాక్టివ్ గా ఉండేందుకు అవసరమైన ఆక్సీజన్, పోషకాలను అందిస్తుంది. రోజువారీ వ్యాయామం మెదడును ఆరోగ్యంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది. 



Read Also: మెదడుపై మొదటి దాడి? భయానకంగా మారుతోన్న డెంగ్యూ - షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్స్