Mahipal Reddy met cm Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత అధికార పార్టీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతలోనే గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ భేటీతో బీఆర్ఎస్ పార్టీ మరో ఎమ్మెల్యేను కోల్పోతుందన్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్లు అయింది.


సీఎం రేవంత్‌ను కలిసిన మహిపాల్ రెడ్డి 
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కలవడంతో ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం ఊపందుకుంది. మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి 2014 నుంచి మూడు వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందుతూ వస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఆ తరువాత హస్తం పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోతున్నాయి. ఓవైపు జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. మరోవైపు జిల్లాల నుంచి సైతం ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ ను కలవడంతో ఆయన సైతం పార్టీ జంప్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని చర్చ జరుగుతోంది.


ఇదివరకే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇప్పటికే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ బీఆర్ఎస్ త్వరలో ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము బీఆర్ఎస్ ను వీడి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 



హస్తం గూటికి అరికెపూడి గాంధీ
శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసమే తాను పార్టీ మారుతున్నట్లు గాంధీ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు. వీరిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్,  హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిన వారున్నారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరగా, మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ తో భేటీతో 10వ ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరిక ఖాయమని వినిపిస్తోంది.