కేరళ అంటే గుర్తొచ్చేవి రకరకాల చేపల వంటకాలే. అక్కడి వంటకాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. చేపలోనే చాలా పోషకాలు ఉంటాయి. అరటి ఆకులో వండడం వల్ల ఆ ఆకులో ఉన్న పోషకాలు కూడా చేపకు చేరుతాయి. ఆ రెండింటి పోషకాలు కలిపి తినాలంటే ఇలా అరటిఆకులో ఫిష్ నిర్వాణ వండుకోవాలి. కేరళలో దీన్ని ఫిష్ నిర్వాణ అంటారు. మనం తెలుగులో చేపల వేపుడనే చెప్పుకోవాలి.  దీన్ని చేయడం ఎంతో సులువు. 


కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు - రెండు
అరిటాకు - చేపలు చుట్టడానికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూనులు
కొబ్బరి తురుము - రెండు స్పూనులు
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు 
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
ధనియాల పొడి - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఉల్లిపాయల తరుగు - రెండు స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
నిమ్మరసం - రెండు స్పూనులు


తయారీ ఇలా
1. చేప ముక్కలు కాస్త పెద్దవి ఎంచుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
2. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి తురుము, కొత్తిమీర కలిపి మిక్సీలో మెత్తటి పేస్టులా చేసుకోవాలి. 
3. ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, ధనియాల పొడి, మిక్సీలో చేసుకున్న మెత్తటి పేస్టు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో కరివేపాకులు కూడా వేసుకోవాలి. 
4. అందులో నూనె కూడా వేసి బాగా కలపాలి. 
5. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించాలి. ఓ పావుగంట సేపు పక్కన వదిలేయాలి. 
6. అరటిఆకును చిన్న మంట పై ఇటూ అటూ వేడిచేయాలి. దీని వల్ల ఆకు మెత్తగా మారి చేపను చుట్టడానికి వీలుగా అవుతుంది. 
7.ఇప్పుడు అరటి ఆకులో ఒక చేప ముక్కని పెట్టి మడత బెట్టాలి. ఒకసారి కాకుండా రెండు పొరలుగా అరటి ఆకును చుట్టాలి. 
8. అరటిఆకు ఊడిపోకుండా దారంతో కట్టాలి. 
9. పెనం వేడెక్కాక నూనె వేసి అరటిఆకులో చుట్టిన చేపను పెట్టాలి. 
10. రెండు వైపులా బాగా కాల్చాలి. 
11. చిన్న మంట మీద కాలిస్తే చేప బాగా ఉడుకుతుంది. 
12. దీని రుచి చాలా భిన్నంగా ఉంటుంది. 
13. ఓవెన్ ఉన్న వారు అందులో కూడా చేసుకోవచ్చు. 
14. కొంతమంది కుక్కర్లో కూడా వండుతారు. 
ఎలా వండినా అరటి ఆకులో చేప వేపుడు అదిరిపోతుంది. 


Also read: చపాతీలు చేసేటప్పుడు ఈ పదార్థం కలపండి, త్వరగా బరువు తగ్గుతారు


Also read: మంకీపాక్స్ - స్మాల్ పాక్స్ మధ్య తేడాను కనిపెట్టడం ఎలా? నిపుణులు ఏమంటున్నారు?



Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకో అరటి పండు లాగించేయండి