Sri Lanka President's office: ఎన్నో రోజులుగా నిరసనలతో అట్టుడుకుతోన్న శ్రీలంకలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. శ్రీలంక అధ్యక్ష భవనాన్ని సోమవారం మళ్లీ తెరిచారు. ఆర్థిక సంక్షోభంతో నిరసనకారులు కొన్ని రోజుల పాటు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అధ్యక్ష భవనాన్ని తిరిగి తెరిచారు.
భారీ భద్రత
గత శుక్రవారం భారీగా బలగాల సాయంతో సైన్యం.. ఆ భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అనంతరం అధ్యక్ష భవనం వద్ద సైన్యం కవాతు నిర్వహించింది. నిరసనకారులు చాలా మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది.
కొత్త అధ్యక్షుడు
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఇటీవల ఎన్నికయ్యారు. పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ఎంపీలు.. రణిల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
44 ఏళ్లలో తొలిసారి
దేశాన్ని దివాలా తీయించి మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. నిజానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. ఆయన రాజీనామా చేయడంతో కొత్తగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు.
లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో 223 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మరోవైపు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పార్లమెంటుకు రాజీనామా లేఖను పంపారు. దీంతో కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకుంది. గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్నే ఎంపీలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
Also Read: Draupadi Murmu Unknown Facts: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా?
Also Read: Bus Accident In UP: ఘోర ప్రమాదం- ఒకదానికొకటి ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సులు, 8 మంది మృతి!