చేపల ఇగురు, చేపల వేపుడు, చేపల పులుసు... ఇలా చేపలతో ఎప్పుడూ ఇలాంటి వంటకాలే కాదు, ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా పెద్ద కష్టమేం కాదు, కేవలం ముల్లు లేని చేపలు తెచ్చుకుంటే చాలు మిగతా అంతా చేయడం సులువే. చికెన్ ఫ్రైడ్ రైస్ బోరు కొడితే ఇలా ఓసారి ఫిష్ ఫ్రైడ్ రైస్ ప్రయత్నించి చూడండి. 


కావాల్సిన పదార్థాలు
ముల్లు తీసిన చేప ముక్కలు - అరకిలో
వండిన అన్నం - మూడు కప్పులు
క్యాప్సికం - ఒకటి
ఉలిపాయ - రెండు
అల్లం - ఒక చిన్న ముక్క
వెల్లుల్లి - పది రెబ్బలు
కొత్తిమీర - ఒక కట్ట
సోయా సాస్ - రెండు టీ స్పూనులు
చిల్లీ సాస్ - రెండు టీ స్పూనులు
మిరియాల పొడి - ఒక టీస్పూను
నూనె - సరిపడినంత,
ఉప్పు - రుచికి తగినంత


తయారీ ఇలా
1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
2. మీకు నచ్చిన పరిమాణంలో చేప ముక్కల్ని కోసి పెట్టుకోవాలి. 
3. చేప ముక్కలకు తడి లేకుండా చూసుకోవాలి. 
4. ఒక గిన్నెలో చేప ముక్కలు వేసి సోయాసాస్, మిరియాల పొడి, చిల్లీ సాస్ వేసి ముక్కలకు పట్టేలా చేయాలి. 
5. ఇప్పుడు అన్నంలో కాస్త ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 
6. అన్నం పెద్ద కంచంలో వేసి మెతుకులు అంటుకోకుండా పరచాలి. 
7. ఇప్పుడు కళాయిలో నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కల్ని వేసి వేయించాలి. 
8. వాటిని ఎర్రగా వేయించి తీసి ఒక గిన్నెలో తీసి వేసుకోవాలి. 
9. ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి తరుగుని వేసి వేయించాలి. 
10.నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా వేయించాలి. 
11.  అలాగే ముందు వేయించుకున్న చేప ముక్కలు కూడా వేయాలి. 
12. అన్నింటినీ బాగా వేయించాక వండిన అన్నాన్ని వేసి కలపాలి. 
13. పైన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేయాలి.  


చేపలతో లాభాలు
చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. చేపలు తినే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. చేపలు తినే వారు తక్కువగా ఒత్తిడి బారిన పడతారు. ఇవి శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ అనే హర్మోనులు విడుదలవుతాయి. ఇవి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే హార్లోనులు. చేపలు తినే మహిళల్లో రుతుక్రమం సమయానికి అవుతుంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. తరచూ వాటిని తినడంవల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చేపల నుంచి విటమిన్ డి శరీరానికి అందుతుంది. అలాగే అనేక రకాల పోషకాలు అందుతాయి. యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తాయి చేపలు. డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలను చేపల్లోని పోషకాలు తగ్గిస్తాయి. 


Also read: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు


Also read: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే