ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్’ సినిమాతో సత్తా చాటిన పాన్ ఇండియన్ డైరెక్టర్. ‘కేజీఎప్-2’తో మరోసారి భారతీయ సినిమా పరిశ్రమను షేక్ చేసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ నీల్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి సొదరుడు సుభాష్ రెడ్డి కొడుకు. ఏపీలోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గానికి చెందిన నీలకంఠాపురం ఆయన సొంతూరు. తాజాగా అక్కడ జరిగిన తన తండ్రి జయంతి కార్యక్రమాల్లో ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన స్వగ్రామంలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి కోసం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. తన తండ్రి 75వ జయంతి సందర్భంగా ప్రశాంత్ ఈ విరాళం అందించినట్లు రఘువీరా రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.     ఇక నుంచి చిన్నాన్నకు తోడుంటా..: ప్రశాంత్ నీల్ సొంతూరు నీలకంఠాపురం. కానీ, ఆయన పుట్టింది, పెరిగింది, అంతా బెంగళూరులోనే. కొద్ది కాలం క్రితమే ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి చనిపోయారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరిగాయి. అప్పటి నుంచి వీలున్నప్పుల్లా ప్రశాంత్ నీల్ ఈ ఊరికి వచ్చిపోతున్నారు. ఆగష్టు 15న సుభాష్ రెడ్డి జయంతి. ఈ నేపథ్యంలోనే ఆయన సొంతూరికి వెళ్లి తండ్రి సమాధికి నివాళులర్పించారు. 

గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆయన తన చిన్నాన్న నిర్మించిన దేవాలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. నీలకంఠాపురంలో తన చిన్నాన్న నిర్మించిన దేవాలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అక్కడి నుంచి ఆయన గ్రామంలో నిర్మిస్తున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లారు. ఈ నిర్మాణం కోసం తన వంతుగా భారీ విరాళాన్ని అందించారు. ఇక నుంచి నీలకంఠాపురంలో తన చిన్నాన్న చేపట్టే సేవా కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని చెప్పారు. తగిన సహాయం అందిస్తానన్నారు. తాను చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే తన సమాధి నిర్మించాలని కుటుంబ సభ్యులకు చెప్తానని వెల్లడించాడు. 

ప్రశాంత్ సాయం గర్వించే విషయం: నీలకంఠాపురంలో ప్రశాంత్ నీల్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమ  గ్రామంలో నిర్మించబోయే కంటి ఆస్పత్రి కోసం రూ.50 లక్షల విరాళం ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ప్రశాంత్ నీల్ సాయం.. తనతో పాటు నీలకంఠాపురం గ్రామాస్తులకు సైతం గర్వించే విషయం అన్నారు. ప్రశాంత్ నీల్ తండ్రి, తన సోదరుడు సుభాష్ రెడ్డి.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే జన్మించారని ట్విట్టర్ వేదికగా రఘువీరా వెల్లడించాడు. ప్రస్తుతం సినిమాల్లో ప్రశాంత్ నీల్ చాలా బిజీగా ఉన్నారు. కేజీఎఫ్-2తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆయన.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’ మూవీతో జనాల ముందుకు రాబోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ తో కూడా త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు ప్రశాంత్ నీల్.

Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?