Child's Height Growth :పిల్లల ఎత్తు ఎంత పెరుగుతుందనేది ఎక్కువగా జన్యుపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే పోషకాహారం, నిద్ర, వ్యాయామం, జీవనశైలి, మొత్తం ఆరోగ్య పరిస్థితి కూడా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన అలవాట్లు ఉంటే పిల్లలు తమకు సహజంగా వచ్చే గరిష్ట ఎత్తును చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Continues below advertisement

పిల్లల ఎదుగదలకు సంబంధించి యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ & నియోనటాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ డి. శ్రీకాంత్ పలు విషయాలు తెలిపారు. పిల్లల ఎదుగుదల విషయానికి వస్తే.. ఎత్తు పెరగాలంటే ఆహారం, నిద్ర, శారీరక శ్రమ చాలా ముఖ్యమని తెలిపారు.

పోషకాహారం 

పిల్లల ఎముకల పెరుగుదల, శారీరక అభివృద్ధికి ప్రోటీన్, కాల్షియం, విటమిన్ D, ఐరన్, జింక్ వంటి పోషకాలు అవసరం. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వడం మంచిది.

Continues below advertisement

అయితే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు శరీరానికి అందకపోవచ్చు. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

నిద్ర తక్కువైతే పెరగడం కష్టమే..

పిల్లల ఎదుగుదలలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రాత్రి గాఢ నిద్ర సమయంలో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం, నిద్ర సమయాల్లో క్రమబద్ధత లేకపోవడం, పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ లేదా టీవీ చూడడం వంటి అలవాట్లు వల్ల గ్రోత్ హార్మోన్ విడుదలపై ప్రభావం చూపవచ్చు. అందుకే పిల్లల వయసుకు తగినంత నిద్ర అందేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం కూడా ముఖ్యమే..

పిల్లలు రోజంతా కూర్చునే ఉండటం, స్క్రీన్ టైమ్ పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఎదుగుదల విధానాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి పిల్లలతో రన్నింగ్, దూకడం, ఈత, సైక్లింగ్, ఆటలు ఆడటం వంటి శారీరక కార్యకలాపాలు చేయించాలని సూచిస్తున్నారు డాక్టర్ శ్రీకాంత్. ఇవి ఎముకలు, కండరాలు బలంగా ఎదగడానికి సహాయపడతాయని తెలిపారు. 

మానసిక ఆరోగ్యం

పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు తెలిపారు. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, ఇంట్లో లేదా పాఠశాలలో ప్రతికూల వాతావరణం హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపవచ్చు. ప్రేమ, ప్రోత్సాహం, మానసిక మద్దతు ఉన్న వాతావరణంలో పిల్లలు మెరుగ్గా ఎదుగుతారని నిపుణులు చెప్తున్నారు.

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే.. 

పిల్లల ఎత్తు పెరుగుదలను క్రమం తప్పకుండా గమనించడం చాలా ముఖ్యం. అదే వయసు పిల్లలతో పోలిస్తే చాలా పొట్టిగా ఉండటం, ఎదుగుదల వేగం తగ్గిపోవడం, యుక్తవయస్సు లక్షణాలు చాలా త్వరగా లేదా ఆలస్యంగా కనిపించడం వంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి.

గ్రోత్ హార్మోన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, పోషకాహార లోపాలు లేదా కొన్ని జన్యుపరమైన పరిస్థితులు కూడా ఎత్తు పెరుగుదలపై ప్రభావం చూపవచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని సలహాలు ఇచ్చారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.