Karma Scientific Reality: ఎవరైనా మంచి వ్యక్తి చిన్న వయసులో లేదా అకస్మాత్తుగా మరణిస్తే ఆ బాధ నుంచి పుట్టిన మాటే.. మంచోళ్లే ఎందుకు త్వరగా చనిపోతారో అని. ఇంతకీ ఈ మాట నిజమేనా? నిత్యం ఎంతోమంది చనిపోతుంటారు. ఓ సాధారణ వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి చనిపోయినప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. కానీ సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారో, సేవ చేసేవారో, అందరితో ప్రేమగా ఉండేవారో మరణిస్తే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఆ బాధ మనసులో బలంగా ముద్ర పడిపోతుంది. మంచివ్యక్తి కదా..ఇంకొంత కాలం బతికి ఉంటే బావుండును అనిపిస్తుంది. ఆ బాధ నుంచి వచ్చిన మాటే మంచోళ్లే ఎందుకు త్వరగా చనిపోతారో అని. పైగా మంచివారు..తమ స్వార్థం తాము చూసుకోరు, ఎదుటివారి బాగుకోసం తాపత్రయపడతారు, తనచుట్టూ ఉండేవారు బావుండాలని ఆలోచిస్తారు. ఈ తీవ్రమైన ఒత్తిడి వారి ఆరోగ్యంపై, గుండెపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఏ రోజు తలస్నానం చేయకూడదు? జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య నియమాలు, నమ్మకాలు తెలుసుకోండి !
ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే.. వివిధ మతాలు, పురాణాల ప్రకారం దీనికి కొన్ని వివరణలున్నాయి. ముఖ్యంగా కర్మ సిద్ధాంతం గురించి చెబుతారు. హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతి జీవికి ఓ మిషన్ ఉంటుంది. మంచి వ్యక్తి తన కర్మలను ముగించి ఈ జన్మలో ఎక్కువ పుణ్యం సమకూర్చుకుంటే ఆత్మ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఈ భూమిపై తాము చేయాల్సిన మంచి పనులు ఎంత త్వరగా పూర్తైతే అంత త్వరగా మంచివారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారట. ఇంకా ఆచరించాల్సిన కర్మలు మిగిలిపోతే ...అవి తీరేవరకూ భూమ్మీద ఉండాల్సిందే. మంచి కర్మలు పూర్తిచేసేస్తే వారు ఈ లోకాన్ని వీడి ఉత్తమ లోకాలకు చేరుకుంటారని నమ్ముతారు. పాపాత్ములు కర్మలు ముగియకపోవడం వల్ల ఇక్కడే ఉండిపోతారు..ఇది శిక్ష కూడా కావొచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు శరీరం కేవలం దుస్తులు లాంటిది..ఆత్మ అమరమైనది.
బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!
రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సాధ్వి శారదా మాత లాంటి వారు చెప్పిన ప్రకారం.. భగవంతుడు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిని త్వరగా తనవద్దకు తీసుకుంటాడు. ఇది శిక్ష కాదు..ఆ ఆత్మపై ఉన్న అపారమైన ప్రేమ. మంచి వ్యక్తి ఈ లోకంలో కల్మషం, బాధలు ఎక్కువకాలం చూడకుండా రక్షణ పొందుతాడు. కొందరు మహానుభావులు తమ జీవితంలో ఓ సందేశం ఇచ్చి వెళతారు. వారి మరణం కూడా లోకాన్ని ఆలోచింపజేస్తుంది. స్వామి వివేకానంద 39ఏళ్లకే మరణించారు. రామకృష్ణ పరమహంస 49 ఏళ్లు, జ్ఞానేశ్వర్ మహారాజ్ 21 ఏళ్లు..ఇలా చిన్న వయసులోనే వెళ్లిపోయినా శాశ్వత ప్రభావం చూపించారు. వారి జీవితాలు పరిణానం కాదు నాణ్యతను చూపిస్తాయ్.
ఇందులో సైంటిఫిక్ రియాల్టీ ఏంటంటే.. మరణం అనేది ఓ వ్యక్తి మంచి, చెడుమీద ఆధారపడి ఉండదు. అది పూర్తిగా జన్యుపరమైన కారణాలు, ఆరోగ్య అలవాట్లు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటుంది. చెడ్డవారు కూడా తొందరగా మరణించిన వారున్నారు కానీ.. వారి మరణాన్ని గుర్తించం..ఎందుకంటే వారు చేసే కర్మలే అందుకు కారణం. వారి లేని లోటు తెలియకపోవడం మరో కారణం కావొచ్చు. మంచివారు మనమధ్య లేకపోయినా వారు చేసిన మంచి పనులు, పంచిన ప్రేమ ఎప్పటికీ మిగిలే ఉంటుంది. అందుకే మంచి కర్మలే ఆచరించాలని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు బోధించాడు.
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.
