Diabetes Symptoms | మీరు అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారా? అయితే, మీకు డయాబెటిస్ ఉందేమో చెక్ చేయించుకోండి. అంతేకాదు అంగస్తంభన సమస్యలు గుండె జబ్బులకు కూడా సంకేతం. నమ్మబుద్ధి కావడం లేదా? అంగస్తంబనకు డయాబెటిస్‌కు లింకేమిటని ఆలోచిస్తున్నారా? నిపుణుల చెప్పిన ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే.
అంగస్తంభన సమస్యలకు ఎన్నో రకాల జబ్బులు, అలవాట్లు కారణమవుతాయి. మీకు ఆ సమస్య వచ్చిందటే.. డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు పొంచివున్నట్లు అర్థం. అంగస్తంభన సమస్య అనేది ముందస్తు సంకేతమని తెలుసుకోవాలి. డయాబెటిస్ ముదిరినట్లయితే కొందరికి అంగంపై ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడుతుంది.
సాధారణంగా స్మోకింగ్, అతిగా మద్యం తాగే అలవాట్లు అంగస్తంభన సమస్యకు కారణమవుతాయి. పైగా చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల వ్యాధులు ముదిరిపోతాయి. అంగంస్తంభన అనేది నాడీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా ఉంటేనే అంగం స్తంభిస్తుంది. అయితే, డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి పరిస్థితుల వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. ఫలితంగా అంగం స్తంభించదు.
బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ యూరాలజికల్ సర్జన్లు తెలిపిన వివరాల ప్రకారం.. అంగస్తంభన సమస్యలు ఎదుర్కొంటున్న 90 శాతం మంది డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వ్యాధులు మెదడు నుంచి పురుషాంగం వరకు వెళ్లే నరాల ప్రేరణలను ప్రభావితం చేస్తాయి. రక్త ప్రసారణలో సమస్యలను సృష్టిస్తాయి. అంగానికి మంచి రక్తం ప్రసారమైతేనే స్తంభిస్తుంది. అలా జరగకపోతే.. ఎంత ప్రయత్నించినా వృథాయే. కొందరికి సహజంగా జరిగే అంగస్తంబన ప్రక్రియ నిలిచిపోతుంది. కేవలం ప్రేరేపిస్తేనే అంగం గట్టిపడుతుంది.
Also Read: ‘హిందీ’ వివాదంలో చిక్కుకున్న సుహాసిని, ‘మీకంటే సోనూ నిగమ్ బెటర్’ అంటున్న దక్షిణాది జనం!
ఏం చేస్తే బెటర్?: అంగస్తంభన సమస్యలు లేదా, అంగంలో ఇన్ఫెక్షన్, దురద, అంగంలో లోపలి భాగంలో తెల్లని పొరలు ఏర్పడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డయాబెటీస్ లేదా గుండె జబ్బుల మందులను సక్రమంగా తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు. దానితోపాటు నిత్యం వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, జంక్ ఫుడ్‌కు బదులు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవడం చేయాలి. వారంలో మూడు గంటలకు మించి సైక్లింగ్ చేయొద్దు. వారంలో 14 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్‌ను తీసుకోకూడదు. కాబట్టి, అంగస్తంభనను ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి వైద్యుడిని ఆశ్రయించండి.
Also Read: చేతి వేళ్లు విరుచుకొనే అలవాటుందా? ‘మెటికలు’పై డాక్టర్ ఏం చెప్పారో చూడండి
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే అందించాం. వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఏమైనా సందేహాలుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం, ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.