Emotional Intelligence at Workplace : ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవారిలో మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నట్లు చెప్తున్నాయి పలు రీసెర్చ్​లు, స్టడీలు. దీనిలో భాగంగానే మైండ్​ఫుల్​నెస్, ఫిజికల్ యాక్టివిటీ, సెలవులు తీసుకుని రిలాక్స్ అవ్వాలని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. వీటిని ఫాలో అవ్వడం మంచిదే కానీ.. దీని పూర్తి ఇంపాక్ట్ తగ్గించాలంటే అది ఆఫీస్​ నుంచే మొదలవ్వాలి అంటున్నారు కొందరు నిపుణులు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి సహాయపడేలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండే కార్పొరేట్ కల్చర్ అవసరమని చెప్తున్నారు ఫారేసియా రియాల్టీలో

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం

నేటి కార్పొరేట్ వాతావరణంలో.. ఆరోగ్యకరమైన ఆఫీస్ వాతావరణానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్(EI) చాలా అవసరం. అలాంటి సౌలభ్యం ఆఫీస్​లో ఉంటే.. ఆఫీస్​లో ఉండే వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయి. క్లిష్ట సమయాల్లో ఉద్యోగులకు మద్దతు లభిస్తుందని చెప్తున్నారు. వ్యక్తిగతంగా, విస్తృత స్థాయిలో ఉద్యోగుల భావోద్వేగాలను అర్థం చేసుకుని.. వారికి సూచనలు ఇవ్వగలిగే సపోర్ట్​ని ఆఫీస్ అందిస్తే మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గి.. ప్రొడెక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 

కొన్ని ఆఫీస్​లలో ఉద్యోగులు తమ ఫీలింగ్స్ లేదా సమస్యలు చెప్పేందుకు సరైన కమ్యూనికేషన్ ప్లాట్​ఫారమ్ ఉండదు. దీనివల్ల ఉద్యోగి మానసికంగా అలసిపోతారు. ఇది పనిపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగులలో సృజనాత్మకతను, ఉద్యోగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఆఫీస్​లో ఎమోషనల్ సపోర్ట్ కచ్చితంగా అవసరం. దాదాపు 8 నుంచి 10 గంటలు ఉద్యోగంలో గడుపుతున్నప్పుడు కమ్యూనికేషన్ ద్వారా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలిగే సౌలభ్యం ఉంటే.. వారి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.

ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఇవ్వవచ్చంటే..

ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆఫీస్​లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే.. కొన్ని రూల్స్ అప్​డేట్ చేసుకోవాలి. అవి ఎలా ఉండాలంటే.. ఫార్మాలిటీగా దానిలో ఉద్యోగులు పాల్గొనేలా కాకుండా.. అక్కడ సమస్య చెప్తే క్లియర్ అవుతుంది.. కనీసం వాళ్లు విని రెస్పాండ్ అవుతున్నారనే ఫీలింగ్ రప్పించేలా ఉండాలి. అలాంటి పద్ధతులు ఇక్కడున్నాయి. 

  • వినేవారు ఉండాలి : ఆఫీస్​లో పై స్థాయిలో ఉన్నవారు ఉద్యోగుల ఫిర్యాదులను వినాలి. కనీసం వారికి ఉన్న ఇబ్బందులు చెప్పగలిగే స్పేస్ ఇవ్వాలి. వారికి మద్దతు ఇస్తూ.. వారి ఫీలింగ్స్​కి సపోర్ట్ చేయాలి. వారు చెప్పిన విషయాలు సరైనవో, కాదో తెలుసుకుని రెస్పాండ్ అవ్వాలి. ఇవి ఉద్యోగుల్లో సగం ఒత్తిడిని తగ్గిస్తాయి.
  • జడ్జ్ చేయకండి : మీ దగ్గర ఉద్యోగి ఏదైనా సమస్య గురించి ఓపెన్​గా, నిజాయితీతో చెప్పినప్పుడు వారిని జడ్జ్ చేకూడదు. మానసిక భద్రత అనేది కార్మికులు తమను తాము వ్యక్తపరచగలిగే విధంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు. 
  • గుర్తింపు, ప్రశంసలు : ఉద్యోగులను అధికారులు మెచ్చుకోవాలి. వారు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీరు ఇవ్వగలిగే చిన్న కాంప్లిమెంట్, అప్రిషియేషన్ వారికి ఎంతో బూస్ట్ ఇస్తుంది. పనిని గుర్తించి మెచ్చుకోవడానికి, కష్టాన్ని ప్రశంసించడానికి ఆలస్యం చేయకూడదు. లేదంటే ఉద్యోగి ఎంత చేసినా ఇంతేనా మనకి దక్కే గౌరవం అని బాధపడతారు. 
  • రెస్పాండ్ అవ్వండి : భావోద్వేగ సమస్యలను తగ్గించడానికి వారి చెప్పే సంకేతాలు అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యేందుకు ప్రయత్నించండి. 
  • పని-జీవిత సమతుల్యతకై : మానసిక సామర్థ్యం,శ్రేయస్సు కోసం.. రీజనబుల్ పని గంటలు ఉండేలా చూసుకోవాలి. 

సంస్థలు మానసిక శ్రేయస్సుపై దృష్టి పెడితే ఉద్యోగి మానసికంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు.. ఆఫీస్​కు మంచి ప్రయోజనాలు అందుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రొడెక్టెవిటీ మెరుగవడానికి హెల్ప్ అవుతుంది. ఉద్యోగులు మానసికంగా ఎంత సురక్షితంగా ఉంటారో.. వారి శక్తి మీరు ఊహించని దానికంటే మెరుగవుతుందని తెలిపారు కేశవ్ మాంగ్లా. ఉద్యోగి మానసికంగా సేఫ్​గా ఉంటే ఆఫీస్​ విజయాలను అందుకుంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.