గుడ్డు చాలా మందికి ఎంతో ఇష్టమైన అల్పాహారం. అధిక ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలని అందిస్తుంది. అయితే గుడ్డు తినడం వల్ల గుండెకి హానికరం అని చాలా మంది నమ్ముతారు. కానీ అమెరికన్ హర్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం గుడ్డులోని పచ్చసొనతో కలిపి తినాలని సిఫార్సు చేస్తోంది. దాదాపు 32 సంవత్సరాల డేటా పరిశీలించిన దాని ప్రకారం గుడ్డు హృదయానికి ఎటువంటి ముప్పు ఉండదని చెప్తున్నాయి. సంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ పై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. అయితే తక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులను తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.
బరువు తగ్గించుకోవచ్చు
బరువు తగ్గించుకోవాలంటే కేలరీలు బర్న్ చేసుకోవాలి. కెలరీలు లేని ఆహారం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందని అందరూ నమ్ముతారు. గుడ్డులో మొత్తం 74 కేలరీలు ఉంటాయి. కానీ ఇందులో పోషకాలు చాలా ఎక్కువ. గుడ్డు తింటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఆహారంలో గుడ్లని చేర్చడం ద్వారా మొత్తం కేలరీలను తగ్గించుకోవచ్చు.
గుడ్లు ఎలా తినాలి
గుడ్లు ఉడకబెట్టుకుని తినడం మంచిది. నూనెలో వేయించుకుని తినడం కంటే పోషకాలు పొందాలంటే ఉడకబెట్టినవి మాత్రమే తినాలి. ఇతర పోషకాలు నిండిన కూరగాయలతో కలిపి తీసుకుంటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్లు తయారుచేసుకునేటప్పుడు జోడించే కొవ్వు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెన్న లేదా శుద్ది చేసిన నూనెలు నివారించాలి. ఇవి అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులను జోడిస్తుంది. వాటికి బదులుగా ఒక టీ స్పూన్ నెయ్యి లేదా ఆరోగ్యకరమైన కొవ్వుని జోడించాలి.
ఎగ్స్ తో ఇలా చేసుకోండి
☀వెజిటబుల్స్ తో లోడ్ చేసిన ఎగ్ మఫిన్లు సులభంగా తయారుచేసుకోవచ్చు. మీకు నచ్చిన కూరగాయాలను కోసి గుడ్డులో వేసుకొని ఓవెన్ లో పెట్టుకోవాలి. టైమర్ ఆన్ చేసి ఉడికిన తర్వాత వాటిని తినేయవచ్చు.
☀ఎంతో రుచికరమైన ఎగ్ సలాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆకులు, కూరగాయలు వేసుకుని సలాడ్ చేసుకోవచ్చు. అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్, వెనిగర్ డ్రెస్సింగ్ గా వేసుకుని ఉడికించిన గుడ్లు జోడించుకుని తినొచ్చు.
☀బెల్ పెప్పర్ లో విత్తనాలు తీసేసి దాన్ని గుండ్రంగా కట్ చేసుకుని పాన్ మీద వేడి చేసుకోవాలి. వాటిలో గుడ్లు వేసుకుని కొద్దిగా ఉప్పు, కారం వేసి తింటే చాలా బాగుంటాయి.
రోజుకి ఎన్ని తినాలి?
శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు తింటే సరిపోతుంది. ఒక రోజులో ఎక్కువ gడ్లు తింటే మాత్రం శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు గుడ్డులోని పచ్చసొన తీసేసి తినొచ్చు. మితంగా గుడ్లు తినడం వల్ల డయాబెటిస్, రక్తపోటు వచ్చే అవకాశం తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వరల్డ్ బెస్ట్ ఫ్యాట్ బర్నర్ - శరీరంలోని కొవ్వును కరిగించే అత్యుత్తమ పండు ఇదేనట!