ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యమైనది. ఎవరి ఆరోగ్యమైన వారు తినే ఆహారంపై 50 శాతం ఆధారపడి ఉంటుంది. అలాగే అతని జీవనవిధానాలు, కుటుంబ ఆరోగ్యచరిత్ర కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘాయువు కావాలంటే కొన్ని రకాల ఆహారాలు రోజూ తినాలి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘాయువుకు దోహదం చేస్తాయి. జపాన్, గ్రీస్, కోస్టారికా, ఇటలీ వంటి దేశాల్లోని ఒకినావా, ఇకారియా, సార్డినియా మరియు నికోయా వంటి ప్రాంతాలలో ఆరోగ్యవంతంగా, దీర్ఘాయువుతో జీవిస్తున్న వ్యక్తులు అధికంగా ఉన్నారు. వారు ఏం తింటున్నారు, వారి జీవనశైలేంటి అనే విషయాన్ని చాలా మంది అధ్యయనం చేశారు. ఎక్కువకాలం జీవించాలని కోరుకునే వారు మీ రోజువారీ ఆహారంలో క్రింది సూపర్‌ఫుడ్‌లను చేర్చుకోవాలి. 


1. బీన్స్
మూత్రపిండాల ఆకారంలో నల్లగా ఉండే బీన్స్ రోజూ ఓ గుప్పెడు ఉడకబెట్టుకునో లేక కూరలో కలుపుకునో తినాలి. వీటిలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వ్యాధులతో పోరాడే శక్తికి ఇవి ప్రధాన వనరులు. బీన్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్లాక్ బీన్స్ లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 


2. బంగాళాదుంపలు
గ్రీస్, జపాన్ దేశాలలో వీటిని రోజూ తింటారు. మన దగ్గర రోజూ వీటిని తినేందుకు భయపడతారు. కారణం ఇవి అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలుగా పరిగణిస్తారు. కానీ వీటిని పరిమితంగా తిని ఆరోగ్యంగా జీవించే వాళ్లున్నారు. ఫైటో కెమికల్స్ ఇందులో ఉంటాయి. ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, బి6 సమృద్ధిగా ఉంటాయి.


3. వెల్లుల్లి
భారతీయ వంటల్లో దీన్ని విరివిగా వాడతారు. వయసుతో పాటూ వచ్చే రోగాలను నియంత్రించడంలో వెల్లుల్లిది ప్రత్యేకస్థానం. కాబట్టి రోజూ మీరు వండే వంటల్లో దీన్ని కలిపేయండి. పప్పులు, బిర్యానీలు, కూరలు అన్నింట్లో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వాటిని తినేముందు తీసిపడేయకుండా ఎంచక్కా తినేయండి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, మధుమేహ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. 


Also Read: చికెన్‌ను స్కిన్‌తో పాటూ తింటే ఎన్ని లాభాలో, హార్వర్డ్ శాస్త్రవేత్తలూ అదే చెబుతున్నారు


4. ఆలివ్ ఆయిల్
గ్రీస్‌లో ఆలివ్ ఆయిల్ ను అధికంగా వాడతారు. దీనిని రోజువారీ వంటలకు వాడడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. మంచి శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ఇది సాయపడుతుంది. 


5. టమాటోలు
దాదాపు అన్ని దేశాల్లో టమాటోలు దొరుకుతాయి. దీన్ని రోజూ తినాల్సిన అవసరం చాలా ఉంది. దీనిలో లైకోపీన్ దొరుకుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్. చెర్రీ టొమాటోలు మరీ మంచివి. ఇందులో అధిక మొత్తంలో బీటా కెరాటిన్ ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. 


Also Read: మహాభారతంలో ప్రస్తావించిన ఈ వంటకాలు, ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం