మహాభారతం అంటే గుర్తొచ్చేది కురుక్షేత్రమే. చరిత్ర మరిచిపోని యుద్ధానికి దారితీసిన సంఘటనల సమాహారమే మహాభారతం. మహాభారతం జరిగిన నాటి కాలంలో తిన్న ఆహారం చాలా స్వచ్ఛమైనదని, పవిత్రమైనదని భావిస్తారు చాలా మంది. మహాభారత గ్రంధంలో ప్రస్తావించిన కొన్ని వంటకాలను ఇప్పటికీ మనం ఆరగిస్తున్నాం. ఇప్పటికీ అవి హాట్ ఫేవరెట్లే. 


పాయసం
మహాభారతంలో ధర్మరాజు ప్రతిరోజు పాయసం తినేవాడని చెబుతారు. దీని ప్రస్తావం ఉద్యోగ పర్వంలో ఉందని అంటారు. ఆ కాలంలో చెరకు లేదా బెల్లంతో పాటూ పాలు, అన్నం వేసి ఉడకబెట్టి దీన్ని తయారుచేసేవారు. ఇప్పుడు మనం పంచదారని వాడుతున్నాం. 


జిలేబి
ఇప్పుడు మనం జిలేబి అంటున్నాం కానీ, మహాభారతంలో దీన్ని సష్కులి అనేవారు. బియ్యం లేదా బార్లీని ఉపయోగించి చేసేవారు. నువ్వులు, చెరకు లేదా బెల్లాన్ని జోడించి వండేవారు. దీని ప్రస్తావన శాంతి పర్వంలో ఉంది. 


ఖీర్
ఇది కూడా పాయసం లాంటిదే, దీన్ని క్రిసర అనే వాళ్లు. బియ్యము, పాలు, నువ్వులు, బెల్లం లేదా చెరకు రసం, కుంకుమపువ్వు, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటితో తయారుచేసేవారు. దీన్ని మనం ఖీర్ పిలుచుకోవచ్చు. బియ్యం వాడినా కూడా మెతుకు దొరకదు మెత్తగా కలిసిపోతుంది. ఇదొకరమైన పాయసం. దీని ప్రస్తావన శాంతి పర్వంలో ఉంది. 


సమ్వయా
ఇలాంటి వంటకాలు మనం ఎన్నోరకాలు చేసుకుంటుంన్నాం. వాటన్నింటికీ ఆది వంటకం ఇదే అయ్యుంటుంది. మహాభారత కాలంలో గోధుమ పిండి, పంచదార, పాలు, నెయ్యి వేసి చేస్తారు దీన్ని. చూడటానికి కచోరీలా కనిపిస్తుంది. అనుశాసన పర్వంలో దీన్ని ప్రస్తావించారు. 


మాంసాహార వంటకాలు
మనం కోడిమాంసాన్ని వండుకోవడం మహాభారత సమయంలో కూడా ఉంది. చేపలు, కోడి మాంసంతో వండుకున్న కూరని వారు ఇష్టంగా తినేవారు. కోడికూర అప్పటి నుంచే చాలా ఫేమస్. దీని ప్రస్తావన ద్రోణ పర్వంలో చదవచ్చు. 


అరణ్యవాసంలో ఎక్కువగా తిన్న ఆహారం..
పాండవులు అడవుల్లోనే చాలా కాలం గడిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారికి పంచభక్ష్య పరమాన్నాలు దొరికే పరిస్థితి లేదు. అన్నదమ్ములు అధికంగా జింకల్ని వేటాడేవారని చెబుతారు. ద్రౌపది జింక మాంసాన్నే వండి వడ్డించేదని అంటారు. అడవుల్లో దొరికే పండ్లు, దుంపలు, కాయలతో వారి జీవనం సాగేదట. అయిదుగురు భర్తలు తిన్నాకే చివరలో ద్రౌపది ఆహారం తినేది. 


యుద్ధసమయంలో...
కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులకు ఆహారం వండే బాధ్యతని తీసుకున్నది ఉడిపి రాజు. రోజూ చనిపోయే వీరుల సంఖ్యను ఊహించి మీర ఆహారాన్ని సిద్ధం చేసేవాడట. కాకపోతే అంతా వెజిటేరియన్ ఆహారమే. అందుకేనేమో ఇప్పటికీ ఉడిపి శాకాహార వంటలకు ప్రసిద్ధి.