కొందరు దొంగలు ఇంట్లో దుస్తులు వదిలిపెట్టకుండా మొత్తం ఎత్తుకుపోతారు. కానీ దొంగ చాలా మంచివాడు. అసలు ఎందుకు వచ్చాడో కూడా యజమానులకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ఇంటి నుంచి ఏమీ తీసుకోలేదు. సరికదా తిరిగి ఇచ్చి వెళ్లాడు. ఆ ఇంటి యజమానులు కూడా అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అమెరికాలోని న్యూమెక్సికోలో జరిగింది. 


ఒక వ్యక్తి రాత్రి పూట ఓ ఇంటి కిటికీ విరగ్గొట్టి లోపలికి ప్రవేశించాడు. అతని దగ్గర తుపాకీలు ఉన్నాయి. దీంతో ఇంటి యజమానులు భయంతో ప్రతిఘటించలేకపోయారు. అతని చెప్పినట్టు ఓ మూల బుద్ధిగా కూర్చున్నారు. అతడు ఆ రాత్రి అక్కడే కాసేపు పడుకున్నాడు, కడుపు నిండా భోంచేశాడు, స్నానం కూడా చేసి ఫ్రెషప్ అయ్యాడు. తరువాత తన కథను ఆ యజమానులకు చెప్పాడు. తాను దొంగని కాదని, టెక్సాస్ నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపేశారని, వారే తనను కూడా చంపడానికి వెంటపడుతున్నారని అందుకే పారిపోయినట్టు వివరించాడు. దారిలో కారు ఆగిపోవడంతో ఇలా కిటికీ దూకి ఇంట్లోకి ప్రవేశించినట్టు చెప్పాడు. 


Also read: మహాభారతంలో ప్రస్తావించిన ఈ వంటకాలు, ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం


ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలు, డైమండ్ జ్యూయలరీని అతను ఏమాత్రం ముట్టుకోలేదు. వెళ్లేముందు కిటీకీ విరగ్గొట్టినందుకు సారీ చెప్పాడు. రెండు వందల డాలర్లు అంటే మన రూపాయల్లో పదిహేను వేలు వారికిచ్చి మరీ వెళ్లాడు. అతని పేరు మాత్రం చెప్పలేదు. యజమానులు చెప్పిన దాని ప్రకారం ఆ యువకుడి వయసు 20 దాటి ఉంటుందని, ఆరడుగుల ఎత్తు ఉంటాడని మాత్రం తెలుస్తోంది. అతని కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. 


యజమానులు కేసు పెట్టాక ఇంట్లో జరిగిన నష్టాన్ని పోలీసులు అంచనా వేశారు. కేవలం 15 డాలర్లు మాత్రమే అతని వల్ల వీరికి నష్టం జరిగినట్టు గుర్తించారు. దొంగ 200 డాలర్లు ఇచ్చి వెళ్లాడు కనుక ఇది నష్టం కాదు లాభమేనని చెప్పాలి. 


వింత దొంగతనాలు...
మనదగ్గర కూడా చాలా వింత దొంగతనాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాగపూర్లో వాహనాలను దొంగిలించి చలిమంట వేసుకున్నారు కొంతమంది దొంగలు. హైదరాబాద్ లోని మరో దొంగ చదువు కోసం ఏడు దేవాలయాల్లో హుండీలు పగుల గొట్టి దొంగతనం చేశాడు.  డబ్బులున్నప్పుడు తిరిగి హుండీల్లో వేసి దేవుడికే అప్పుతీర్చసాగాడు. పూర్తిగే తీర్చేలోపే పట్టుబడ్డాడు. జగిత్యాలలో అయితే ఏకంగా కారులో పూలకుండీలు ఎత్తుకెళ్లిపోయాడు ఓ దొంగ. పుర్రెకో బుద్ధి అంటే ఇదేనేమో.


Also read: చికెన్‌ను స్కిన్‌తో పాటూ తింటే ఎన్ని లాభాలో, హార్వర్డ్ శాస్త్రవేత్తలూ అదే చెబుతున్నారు