భారతీయులు పెరుగు లేకుండా తమ భోజనం ముగించరు. ప్రతి ఒక్కరికీ ఇది రోజువారీ ఆహారంలో ఒక భాగం. రుచికరంగా ఉండే ఇది మిమ్మల్ని ఫిట్ గా చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రోబయోటిక్స్ ఇందులో ఉంటాయి. ఇందులోని ఈస్ట్ లు జీర్ణక్రియని బలంగా ఉంచడానికి దోహదపడతాయి. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి స్థాయిలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే పెరుగు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ దుష్ప్రభావాలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం కాకపోయినప్పటికి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మరిన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


జీర్ణ సమస్యలు


తేన్పులు రావడం, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి అనేక జీర్ణ సమస్యల్ని నయం చేయడంలో పెరుగు సహాయం చేసినప్పటికీ అందులోని కొన్ని హానికరమైన బ్యాక్టీరియా ఆధారిత ప్రోబయోటిక్ సమస్యలు గ్యాస్, ఉబ్బరం పెరగడానికి కారణమవుతాయి. పెరుగును క్రమం తప్పకుండా తీసుకునే వారిలో తీవ్రమైన మలబద్ధకం, దాహం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల పెరుగుదల తగ్గించాలంటే పెరుగు తినడం కొన్ని రోజులు ఆపాలని సూచిస్తున్నారు.


తలనొప్పి


ఒత్తిడి వల్ల తలనొప్పి ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ దీర్ఘకాలిక తలనొప్పికి కొన్ని ఆహారాలు క్రమం తప్పకుండా తినడం కూడా ప్రధాన కారణం. పెరుగు తలలో నొప్పి, మైగ్రేన్ ని ప్రేరేపించే ఆహారం. ఇది బయోజెనిక్ అమైన్ వల్ల జరుగుతుంది. పుల్లటి పెరుగు ఎక్కువగా తిన్న సమయంలో ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ అమైన్ లు నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి రక్త ప్రసరణ తగ్గిస్తాయి లేదా పెంచుతాయి. దీని వల్ల తలనొప్పి వస్తుంది.


అలర్జీలు


కొంతమందికి కొన్ని పదార్థాలు తింటే అలర్జీ వంటి సమస్యలు ఎదురవుతాయి. పేగు, జీర్ణ వ్యవస్థలో అలర్జీని తీవ్రతరం చేయడానికి ప్రోబయోటిక్స్ ప్రధాన కారణం. బయట కొనే పెరుగు ప్యాకెట్స్ మీద ఉండే లేబుల్స్ అందుకే సరిగా చదివి తీసుకోవాలి. ఇందులోని కొన్ని ప్రోబయోటిక్స్ చెడుగా స్పందిస్తాయి.


అంటువ్యాధులు పెరుగుతాయ్


పెరుగు చాలా మందికి సురక్షితంమైన ఆహారమే. కానీ అరుదైన సందర్భాల్లో పెరుగులోని ప్రోబయోటిక్స్ లో కనిపించే బ్యాక్టీరియా లేదా ఈస్ట్ లు రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతాయి. తక్కువ రోగనిరోధక వ్యవస్థ ఉన్న వాళ్ళు దీని బారిన త్వరగా పడతారు. తీవ్రమైన అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారు ప్రోబయోటిక్స్ తీసుకోకూడదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుంది.


ఆర్థరైటిస్ నొప్పులు ఎక్కువ


ఆర్థరైటిస్ సమస్య ఉన్న వారిలో మంట, కీళ్ల నొప్పులు పెంచే అవకాశం ఉంది. పెరుగులోని కొన్ని ప్రోటీన్స్ ఆ నొప్పులు ఎక్కువ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఉదయాన్నే కాఫీ కాదు, అరటి పండుతో రోజును స్టార్ట్ చేయాలట, ఎందుకో తెలుసా?