దయం నిద్రలేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే కొంతమందికి తెల్లారదు. అవి తాగితే రిలాక్స్ గా అనిపిస్తుందని అనుకుంటారు. కానీ వాటికి బదులు ఉదయాన్నే ఒక అరటిపండు తీసుకుంటే చాలా మంచిదని సూచిస్తున్నారు బాలీవుడ్ నటుల పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఉదయం నిద్రలేవగానే మొదట ఏం తింటారో అనేది చాలా ముఖ్యం. అది రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుంది. కొవ్వులు, ప్రోటీన్లతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని తీపి తినాలంటే కోరికల నుంచి దూరంగా ఉంచుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


టీ లేదా కాఫీకి బదులుగా అరటి పండు, నానబెట్టిన బాదంపప్పు, నానబెట్టిన ఎండు ద్రాక్షతో రోజు ప్రారంభిస్తే చాలా మంచిదని ఆమె సూచిస్తున్నారు. జీర్ణక్రియ, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో పోరాడుతున్నట్లయితే రోజుని అరటిపండుతో ప్రారంభించడం మంచిదట. అరటిపండులో శరీరానికి శక్తినిచ్చే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో చక్కెర, ఫైబర్, విటమిన్ బి6 ఉన్నాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటగా ఉన్నప్పుడు ఒక అరటిపండు తింటే ఎనర్జీ వస్తుంది.


ఒకవేళ అరటిపండు తినడం ఇష్టం లేని వాళ్ళు దానికి బదులుగా కాలానుగుణంగా వచ్చే పండ్లు తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉదయం తీసుకునే ఆహార పదార్థాలు ఎంచుకోవాలి. రోజంతా తక్కువ శక్తిగా ఉన్నట్టుగా అనిపిస్తే పొద్దునే 6-7 నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకోవడం మంచిది. అయితే బ్రౌన్ ఎండు ద్రాక్ష కాకుండా నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవడం మంచిది.


నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. గ్యాస్, చిరాకు, డిప్రెషన్ పీసీఓడీ సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే నానబెట్టిన బాదంపప్పు తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. 4-5 నానబెట్టిన బాదం ఒలుచుకుని తినడం మంచిది. మధుమేహం, పీసీఓడీ సమస్య, నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇది చక్కగా పని చేస్తుంది. పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పీరియడ్స్ వచ్చే 10 రోజుల ముందు వాటితో పాటు 1-2 రేకుల కుంకుమపువ్వు తీసుకోవచ్చు. బాదంలో అధిక మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, ఖనిజాలు, ఫైబర్ ఉన్నాయి. గట్ ఆరోగ్యానికి బాదం చాలా మంచిది. మలబద్ధకం సమస్య రాకుండా నియంత్రిస్తుంది.


ఈ చిట్కాలు పాటిస్తే మంచిది


⦿ బ్రేక్ ఫాస్ట్ చేసిన 10-15 నిమిషాల తర్వాత టీ లేదా కాఫీ తాగడం మంచిది.


⦿ భోజనానికి ముందు ఒక గ్లాసు మంచి నీళ్ళు తీసుకోవాలి.


⦿ నిద్రలేచిన 20 నిమిషాలలోపు వీటిని తినాలి లేదా థైరాయిడ్ పిల్ వేసుకోవచ్చు.


⦿ ఫుడ్ తిన్న 15-20 నిమిషాల తర్వాత వర్క్అవుట్ లేదా యోగా వంటివి చేసుకోవచ్చు.


⦿ ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్ళు తాగితే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఇవి తిన్నారంటే బరువు తగ్గడం చాలా ఈజీ అంటున్న నిపుణులు