Bell Peppers: క్యాప్సికం పేరు చెబితేనే చాలామంది పక్కన పెట్టేస్తారు. వాటిని తినేందుకు ఇష్టపడరు. వాటిలో ఎక్కువగా మార్కెట్లో కనిపించేది గ్రీన్ క్యాప్సికం మాత్రమే. కానీ ఎరుపు, పసుపు రంగులో ఉండే క్యాప్సికమ్‌లను తినేవారి సంఖ్య చాలా తక్కువ. వీటిని బెల్ పెప్పర్స్ అంటారు. ఇవి కాస్త ఖరీదైనవి. వీటిని తినేందుకు, కొనేందుకు కూడా చాలామంది ఆలోచిస్తారు. కానీ వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


పులావ్‌లలో, బిర్యానీలలో, సలాడ్లలో, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలో వీటిని వేసి వండుకోవచ్చు. వీటిని ఎండబెట్టి పొడి చేసి కూడా వాడుకోవచ్చు. ఎలా అయినా కూడా వీటిని డైట్ లో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో లూటీన్, జియాక్సింతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీరం మొత్తానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి బెల్ పెప్పర్స్ సాయపడతాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 


క్యాన్సర్ రాకుండా...
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే బెల్ పెప్పర్స్ మెనూలో భాగం చేసుకోవాలి. వీటిలో క్యాన్సర్ కణాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ బెల్ పెప్పర్స్ సూపర్ ఫుడ్ అని పిలుచుకోవచ్చు. వీటిలో ఉండే కెరటెనాయిడ్స్ క్యాన్సర్ రహిత లక్షణాలను కలిగి ఉంటాయి.


బెల్ పెప్పర్స్‌లో లైకోపీన్, విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి శరీరంలో చేరే హానికర ఫ్రీ రాడికల్స్‌ నుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ b6, ఫొలేట్ అధికంగా ఉంటాయి. రక్తంలోని హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఎందుకంటే హోమోసిస్టీన్ అధిక స్థాయిలో ఉంటే గుండె జబ్బుల ప్రమాదం పెరగవచ్చు. కొందరికి బెల్ పెప్పర్స్ వల్ల అలెర్జీ కలిగే అవకాశం ఉంది. కనుక ఈ ఆహార పదార్థం పడుతుందో లేదో తెలుసుకున్నాకే ఎక్కువ మొత్తంలో తినాలి. 



Also read: అధిక రక్తపోటు ఉంటే కనిపించే నిశ్శబ్ద లక్షణాలు ఇవే


Also read: ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేస్తే ఆ సమస్య ఎక్కువవుతుందా?



Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.