Eating Alone Every Day : నేటి హడావిడి లైఫ్​లో చాలా మంది ఒంటరిగా తింటూ ఉంటారు. ఆఫీసులో లంచ్ బ్రేక్ అయినా, ఇంట్లో డిన్నర్ అయినా.. బయటకు వెళ్లి రెస్టారెంట్​లో అయినా.. చాలామంది తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఒంటరిగా తింటారు. ఈ అలవాటు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ నిరంతరం ఒంటరిగా తింటే మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన నెగిటివ్ ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. 

Continues below advertisement

ఒంటరిగా తినడం వల్ల కలిగే నష్టాలు

రెగ్యులర్​గా ఒంటరిగా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం చెడిపోతుందని.. డిప్రెషన్, మెదడు ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. మీరు ఎల్లప్పుడూ ఒంటరిగానే తింటే.. ఈ అలవాటు మీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి హాని చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : ఉదయాన్నే ఓట్స్ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి? బరువు తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ దూరం

Continues below advertisement

ఒంటరిగా తినే అలవాటు ఎందుకు పెరుగుతోంది?

వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, తీరికలేని పనులు, సోషల్ మీడియా వినియోగం పెరగడం వంటివి ప్రజలను వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి దూరం చేస్తున్నాయి. అందుకే చాలామంది తమ భోజనాన్ని హడావిడిగా ముగిస్తుండగా.. మరికొందరు ఒంటరితనం కారణంగా ఒంటరిగా తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ అలవాటు క్రమంగా ఎంత సర్వసాధారణమైపోయిందంటే.. దాని ప్రభావాన్ని కూడా గుర్తించలేనంతగా మారిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. 

మానసిక ఆరోగ్యంపై ప్రభావం 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కలిసి భోజనం చేయడం కడుపు నింపడమే కాకుండా భావోద్వేగ బంధాలను కూడా ఏర్పరుస్తుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి భోజనం చేసినప్పుడు.. ఏదొక సంభాషణలో పాల్గొంటాము. నవ్వుకుంటాము. ఆ రోజు ఒత్తిడి నుంచి కాస్త విరామం పొందుతాము. అయితే ఒంటరిగా భోజనం చేయడం ఈ అవకాశాన్ని ఇవ్వదు. క్రమంగా ఒంటరితనాన్ని పెంచుతుంది. 

Also Read : అన్నానికి బదులు క్వినోవా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా వండుకోవాలంటే

ఒంటరిగా తినడం వల్ల ఒక వ్యక్తి ఇతరుల నుంచి ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగే ప్రమాదం ఉంది. తరచుగా ఒంటరిగా తినే వ్యక్తులు విచారంగా, నిరుత్సాహంగా ఉంటారని కొన్ని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఒంటరిగా తినేటప్పుడు ఫోన్ చూడటం లేదా టీవీ చూడటం వంటి అలవాటు కూడా ఏకాగ్రతతో తినే పద్ధతికి ఆటంకం కలిగిస్తుంది. ఇది అతిగా తినడానికి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది.

ఈ అలవాటును ఎలా మార్చుకోవాలి?

వారానికి కనీసం కొన్నిసార్లు అయినా.. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. పని చేసే చోట సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం కూడా ఒక మంచి ఎంపిక. భోజనం చేసేటప్పుడు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు దూరంగా ఉండటం కూడా ముఖ్యం. అప్పుడే మీరు మీ భోజనంపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. 

ఒంటరిగా తినడం తప్పనిసరి అయితే.. మీరు వీడియో కాల్‌ చేసి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడుతూ కూడా తినవచ్చు. మీ అలవాట్లలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా.. ఒంటరితనం తగ్గి.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. 

Also Read : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు