Diabetes: మధుమేహులు తెల్లన్నం ఎక్కువ తినకూడదు, ఎందుకంటే అందులో చక్కెర శాతం అధికమే. చపాతీలు అధికంగా తిన్నా ప్రమాదమే, ఎందుకంటే దీనిలో గ్లూటెన్ ఉంటుంది. ఇక బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి వాటితో సరిపెట్టుకోవాలి. ఎప్పుడూ వాటినే తిని బోరుకొడితే ఓసారి బ్లాక్ రైస్ ప్రయత్నించి చూడండి. దీన్ని రోజుకో పూట తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. చపాతీలకు బదులు బ్లాక్ రైస్ తిన్నా మంచిదే. మధుమేహం అధికంగా ఉన్నవాళ్లు తెల్లన్నం పూర్తిగా వదిలేయాలి. ఒకపూట బ్లాక్ రైస్, మరో పూట రెండు చపాతీలతో తినాలి. కూరలు, పండ్లు, పెరుగు అధికంగా తినాలి.
రెండు రకాలు
మధుమేహం అనేది రెండు రకాలు. అవి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌లు. ఇందులో టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. టైప్ 2 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌కు స్పందించదు. దీన్నే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. దీన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం అని కూడా అంటారు. దీని వల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. ఇదే మధుమేహం. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్ర పిండాలు దెబ్బతింటాయి. మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం తనిఖీ చేసుకోవాలి. వీరు సరైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయాలి. చక్కెర తక్కువగా ఉండే ఆహారాన్నే తినాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తింటే చాలా మంచిది.
బ్లాక్ రైస్ తింటే ఏమవుతుంది?
డయాబెటిస్‌తో బాధపడేవారికి బ్లాక్ రైస్ ఆరోగ్యకరం.వాటిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు బ్లాక్ రైస్‌లో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఐరన్ కూడా ఉన్నాయి. ఈ పోషకాలతో పాటు, బ్లాక్ రైస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి.
బరువు తగ్గడానికి..
నల్లబియ్యంలో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
గుండెకు...
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇవి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు హానిచేసే పరిస్థితులను శరీరంలో ఏర్పడనివ్వదు. చెడు కొలెస్ట్రాల్ వల్లే గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, గుండె జబ్బులు ఉన్నవాళ్లు నల్లబియ్యాన్ని తింటే మంచిది.
Also read: తల్లిదండ్రులు పిల్లలతో కలిసి టీవీ చూస్తే ఎన్ని లాభాలో, చెబుతున్న అధ్యయనం
Also read: రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.