Rains in Telangana AP:  నైరుతీ రుతుపవనాలు చవరి దశకు వచ్చేశాయి. దీంతో నేడు అక్కడక్కడ వర్షాలు పడ్డా, సెప్టెంబర్ 27 నుంచి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ. 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather)
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు ఓ మోస్తరు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 28, 29, 30 తేదీలు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. కానీ మధ్యాహ్నానికి ఉక్కపోత సైతం అధికం కావడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.





ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అయితే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఎన్.టీ.ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈదురు గాలులు వేగంగా వీచనున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.  అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.