ఓసారి ఊహించుకోండి... భూమే లేకుంటే మనం బతుకులు ఏమవుతాయి? నేల తల్లి బాగుంటేనే మనకు తిండి దొరికేతి, స్వచ్ఛమైన గాలి దొరికేది. ఆ నేలనే మనం కలుషితం చేస్తుంటే, చేతులారా మన బతుకులను మనమే పాడుచేసుకుంటున్నట్టు. నేల తల్లి బిడ్డలం మనమంతా. తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అనాలోచితంగా మనం చేసే కొన్ని చర్యల వల్ల భూమిపై ఉండే ప్రకృతి సమతుల్యం దెబ్బతింటోంది. దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. వాయు కాలుష్యం మితిమీరిపోతోంది. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. ఇలాగే కొనసాగితే మానవజాతి మనుగడే కష్టతరం అయిపోతుంది. కాబట్టి భూమిని కాపాడుకోవాల్సిన మన బాధ్యతలను ప్రతి ఏటా గుర్తు చేసేందుకు వస్తుంది ‘ఎర్త్ డే’. ఈ ధరిత్రీ దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 22న నిర్వహించుకుంటాం.
ఎప్పుడు మొదలైంది?
ఐరాస సెనెటర్ నెల్సన్ 1962లో భూమిని కాపాడుకునే చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక దినం ఉండాలన్న ఆలోచన వచ్చింది.కానీ అది కార్యరూపం దాల్చలేదు. 1969లో మార్చిలో ఐక్యరాజసమితి ఈ దినోత్సవానికి ఆమోదముద్ర వేసింది. 1970లో ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆరోజు పత్రికల వాళ్లను పిలిచి భూమిని కాపాడుకోవడానికి ఏమేం చేయాలో వివరించారు. అప్నట్నించి ఈ దినోత్సవం ఆనవాయితీగా వస్తోంది.
మనమేం చేస్తున్నాం?
ఈ విశాల విశ్వంలో భూమి ఎంత ప్రత్యేకమైనదో తెలుసా? కేవలం ఈ గ్రహం మీదే ప్రాణుల ఉనికి ఉంది. ఆ ప్రాణులకు కావాల్సిన ప్రతిది భూమి సిద్ధంగా ఉంచింది. ఆక్సిజన్ నుంచి ఇంధనాల వరకు ఏమైనా నేల తల్లి ఒడిలో దొరుకుతాయి. మనకు ఇంతగా సేవ చేసే భూమికి తిరిగి మనమేమి ఇచ్చాం? ప్రకృతి అసమతుల్యత ఏర్పడేలా చేశాం, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం, చెట్లను నరికేస్తున్నాం, భూగర్భ జలాలను అవసరానికి మించి తోడేస్తూ భూమిని ఎండిపోయేలా చేస్తున్నాం. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను పెంచేస్తూ భూవాతావరనం వేడెక్కేలా చేస్తున్నాం. మొత్తం భూమినే నాశనం చేసే పనులు చేస్తున్నాం. ఈ పనులు కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం లాంటివి.
ఏం చేయాలి?
చెట్లను కొట్టడం తగ్గించాలి. అందుకు పేపర్లను వాడడం తగ్గిస్తే చెట్లు కొట్టే అవకాశం తగ్గుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. విద్యుత్తును జాగ్రత్తగా వాడుకోవాలి. మాంసాహారాన్ని తగ్గించుకుంటే కార్బన్ ఉద్గారాల ప్రభావం తగ్గుతుంది. చిన్న చిన్న పనులకు కూడా కారు, బైకు వాడడం మానేసి నడుచుకుని వెళ్లడం మంచిది. ఇంటి చుట్టుపక్కల మొక్కలు అధికంగా పెంచాలి. అడవులను తరిగిపోయేలా చేయడం వల్ల కూడా భూమి చిక్కుల్లో పడుతుంది. వ్యవసాయ పద్ధతుల్లో రసాయనాలు వాడడం వల్ల నేలకు చాలా నష్టం జరుగుతుంది. భూమి నిస్సారంగా మారుతుంది. కాబట్టి వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించుకోవాలి.
Also read: ప్రపంచంలోనే ‘ఒంటరి ఇల్లు’, ఇప్పుడు అమ్మకానికి వచ్చింది, ధరెంతో తెలుసా?