ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో అద్భుతమైన మ్యాచ్. పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని ఆఖరి బంతికి బౌండరీ కొట్టి చెన్నైని గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా... చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా... చాలా కాలం తర్వాత ధోని తనలోని ఫినిషర్‌ను బయటకు తీయడంతో ఈ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్లు ఇషాన్ కిషన్ (0: 1 బంతి), రోహిత్ శర్మలను (0: 2 బంతుల్లో) డకౌట్ చేసి ముకేష్ చౌదరి ముంబైని కష్టాల్లోని నెట్టేశాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్‌ను (4: 7 బంతుల్లో) కూడా అవుట్ చేయడంతో ముంబై 23 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (32: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.
అయితే ఈ దశలో కొత్త కుర్రాళ్లు తిలక్ వర్మ (51 నాటౌట్: 43 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), హృతిక్ షౌకీన్ (25: 25 బంతుల్లో, మూడు ఫోర్లు) ముంబైని ఆదుకున్నారు. చివర్లో జయదేవ్ ఉనద్కత్ (19: 9 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడటంతో ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. మొదటి బంతికే రుతురాజ్ గైక్వాడ్‌ను (0: 1 బంతి) అవుట్ అయ్యాడు. ప్రయోగాత్మకంగా వన్‌డౌన్‌లో వచ్చిన మిషెల్ శాంట్నర్ (11: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా విఫలం అయ్యాడు. రాబిన్ ఊతప్ప (30: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), అంబటి రాయుడు (40: 35 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అయితే వీరిద్దరూ అవుటయ్యాక మిగతా వారెవరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది.
ఒకానొక దశలో మ్యాచ్ చెన్నై చేజారిపోయింది అనుకున్నా... మహేంద్ర సింగ్ ధోని (28 నాటౌట్: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) తనలోని ఫినిషర్‌ను బయటకు తీశాడు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన దశలో ఒక సిక్సర్, రెండు బౌండరీలతో మ్యాచ్‌ను గెలిపించాడు.