IPL 2022 Dhawal Kulkarni Likely to Join Mumbai Indians Camp by April end : ఐపీఎల్ 2022 మెగావేలంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రాకు మరో ఎండ్ నుంచి అండగా నిలిచే పేసర్‌తో ఒప్పందం కుదుర్చుకోనుందని తెలిసింది. అనుభవజ్ఞుడైన దవళ్ కుల్‌కర్ణిని జట్టులోకి తీసుకుంటోందని సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్ తిరుగులేని జట్టు. ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో బలంగా ఉండేది. వేలంలో ఎక్కువగా విదేశీ పేసర్లను కొనుగోలు చేయడం వారి గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా ట్రెంట్‌బౌల్ట్‌ను మిస్ చేసుకోవడం ఇందుకు దోహదం చేసింది. ఇప్పుడు కొన్న పేసర్లు ముంబయి పిచ్‌లపై ప్రభావం చూపడం లేదు. జస్ప్రీత్ బుమ్రాకు మరో ఎండ్ నుంచి సహకరించడం లేదు. తైమల్ మిల్స్ వంటి ఆటగాళ్లు ఆయాచితంగా పరుగులు ఇచ్చేస్తున్నారు.
ఐపీఎల్ 2022లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోవడంతో ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడే పుట్టిపెరిగిన దవళ్ కుల్‌కర్ణిని తీసుకోవాలని రోహిత్ శర్మ యాజమాన్యానికి సూచించాడు. నిజానికి గతేడాది అతడు అదే జట్టుకు ఆడాడు. ఈ సారి వేలంలో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. రెండేళ్లుగా వికెట్లేమీ తీయకపోవడమే ఇందుకు కారణం. ముంబయి పిచ్‌లపై ఎక్కువ అనుభవం ఉన్న కుల్‌కర్ణిని తీసుకుంటే మరో ఎండ్ నుంచి బుమ్రాకు సపోర్ట్ చేస్తాడని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడు.
దవల్ కుల్‌కర్ణి ఇప్పటి వరకు 150 టీ20 మ్యాచులు ఆడాడు. 27.45 సగటు, 7.98 ఎకానమీతో 147 వికెట్లు తీశాడు. 4/14 బెస్ట్. అవసరమైతే బ్యాటుతోనూ కాసిన్ని పరుగులు చేయగలడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అతడు 92 మ్యాచులాడి 28 సగటు, 8.31 ఎకానమీతో 86 వికెట్లు తీశాడు. కాగా అతడు 'నేనెక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి' అంటూ కొన్ని గంటల క్రితమే ట్వీట్ చేశాడు. మరి ముంబయి ఫేట్‌ను అతడేమైనా మారుస్తాడేమో చూడాలి.