Matheesha Pathirana Joins CSK: ఐపీఎల్‌ 2022లో మరో కొత్త పేసర్‌ను చూడబోతున్నాం! డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓ కుర్ర పేసర్‌ను జట్టులోకి తీసుకుంది. గాయపడ్డ ఆడమ్‌ మిల్న్‌ స్థానంలో శ్రీలంకకు చెందిన మతీష పతిరాణాను ఎంచుకుంది. అతడి బౌలింగ్‌ శైలి పూర్తిగా లసిత్‌ మలింగను పోలి ఉంటుందని తెలిసింది.


చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచును కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడింది. ఆ మ్యాచులోనే పేసర్‌ ఆడమ్‌ మిల్న్‌కు తొడ కండరాలు పట్టేశాయి. అతడు కోలుకోవడం ఆలస్యం కావడంతో సీఎస్కే మతీష పతిరాణాను అతడి స్థానంలో తీసుకుంది. రూ.20 లక్షల కనీస ధరకు ఒప్పందం కుదుర్చుకుంది.


లసిత్‌ మలింగ బౌలింగ్‌ను తలపించే మతీష పతిరాణా వయసు కేవలం 19 ఏళ్లే. 2022, 2020 అండర్‌-19 ప్రపంచకప్‌ల్లో శ్రీలంక తరఫున ఆడాడు. ఈ ఏడాది ఆడిన ప్రపంచకప్‌లో కేవలం 4 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు.


ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది ఆటగాళ్లు గాయాల పాలై లేదా స్వతహాగా తప్పుకున్నారు. అందులో కేవలం ఆరుగురిని మాత్రమే ఆయా జట్లు రీప్లేస్‌ చేసుకున్నాయి. జేసన్‌ రాయ్‌ ప్లేస్‌లో రెహ్మనుల్లా గుర్బాజ్‌ను గుజరాత్‌ తీసుకుంది. అలెక్స్‌ హేల్స్‌ ప్లేస్‌లో వచ్చిన ఆరోన్‌ ఫించ్‌ కేకేఆర్‌కు మంచి స్టార్ట్స్‌ ఇస్తున్నాడు. మార్క్‌వుడ్‌ స్థానంలో ఆండ్రూ టైతో లక్నో ఒప్పందం కుదుర్చుకుంది.


లవనీత్‌ సిసోడియా బదులు రజత్‌ పాటిదార్‌ను ఆర్‌సీబీ ఎంచుకుంది. రసిక్‌ సలామ్‌ స్థానంలో హర్షిత్‌ రాణాను కేకేఆర్‌ తీసుకుంది. తాజాగా ఆడమ్‌ మిల్న్‌ ప్లేస్‌లోకి మతీష పతిరాణా వచ్చాడు. అయితే నేథన్‌ కౌల్టర్‌నైల్‌ ప్లేస్‌లో రాజస్థాన్‌, దీపక్‌ చాహర్‌ స్థానంలో సీఎస్‌కే వేరేవాళ్లను తీసుకోలేదు.