Heart Attack: గుండెజబ్బులు వయసుతో సంబంధం లేకుండా దాడి చేస్తున్నాయి. పాతికేళ్ల వయసులో కూడా గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో చాలా చిన్న వయసులో గుండెపోటు వస్తున్న కేసులు పెరుగుతున్నట్టు ఇప్పటికే గణాంకాలు చెబుతున్నాయి. అంతెందుకు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కొడుకు కేవలం 21ఏళ్లకే గుండె పోటుతో మరణించారు. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆ యువకుడి ప్రాణం దక్కలేదు. కొంతమంది సెలెబ్రిటీలు కూడా కేవలం 40 ఏళ్లకే మరణించారు. ఒక సర్వే ప్రకారం 2015నాటికే 40 ఏళ్లలోపు వయసున్న రెండు కోట్ల 30 లక్షల మంది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు పెరిగపోతున్న ఈ తరుణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.
పూడికల వల్ల...
గుండె జబ్బులు, గుండె పోటు రావడానికి రక్త నాళాల్లో పూడికలు ప్రధాన కారణం. పూడికల ముప్పు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాన్ని తినడం చాలా అవసరం. మాంసం అధికంగా తినేవారిలో గుండె రక్తనాళల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్లీవ్‌లాండ్ క్లినిక్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మాంసంలో కోలిన్, ఎల్ కార్నిటైన్ రసాయనం అధికంగా ఉంటాయి. వీటిని పేగుల్లోని సూక్ష్మక్రిములు శోషించుకుంటాయి. ఫలితంగా కొన్ని రకాల రసాయనాలు పుట్టుకొస్తాయి. అవి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడేందుకు సహకరిస్తాయి. ఈ పూడికలు రక్తం గుండెకు సరిగ్గా సరఫరా కాకుండా అడ్డుకుంటాయి. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా పూడికలు ఏర్పడతాయి. ఈ పరిస్థితులు గుండె పోటు రావడానికి దోహదం చేస్తాయి.
కాబట్టి మాంసాహారాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. రోజూ తినే అలవాటు ఉంటే మనుకోవడం ఉత్తమం. లేదా చాలా మితంగా రెండు మూడు ముక్కలతో సరిపెట్టాలి. కొలెస్ట్రాల్ ఉండని పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు మెనూలో ఉంటే బెటర్.
వీటికి దూరంగా....
జీవితంలో ఒత్తిడి ఉంటే గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా ఉండడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్, మద్యపానం వంటి చెడు ఆహారపు అలవాట్లను దూరంగా ఉంచాలి. రాత్రి పొద్దుపోయే వరకు నిద్రపోకుండా ఉండడం కూడా మంచిది కాదు. ధూమపానం అలవాటును వదలుకోవాలి. వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి.
Also read: గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ ఎందుకు అత్యవసరం? ఫోలిక్ యాసిడ్ తగ్గితే ఏమవుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.