గర్భం ధరించాక తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. శిశువు ఆరోగ్యానికీ, తల్లి ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోమని సూచిస్తారు వైద్యులు. ప్రత్యేకించి శిశువుకు పోషకాహారం అందే విధంగా తినమని చెబుతారు. అయితే పూర్వం నుంచి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. గర్భం ధరించాక నెయ్యి తినడం వల్ల సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందని అంటారు. కుటుంబంలోని పెద్దలు గర్భవతిగా ఉన్న స్త్రీని నెయ్యి తినమని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


నిజమేనా?
నెయ్యిని ఒక ఆహార పదార్ధంగా చూస్తే ఎన్నో సుగుణాలను కలిగి ఉంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే గర్భం చివరి నెలల్లో నెయ్యి తినడం వల్ల సాధారణ ప్రసవం అవుతుందని ఎక్కడా శాస్త్రీయంగా రుజువు కాలేదు. పెద్దలు భావిస్తున్న ప్రకారం నెయ్యి తినడం వల్ల డెలివరీ సమయంలో సాధారణ పద్ధతిలో బిడ్డ సులభంగా బయటికి జారిపోవడానికి సహాయపడుతుందని అంటారు. ఇది నిజమని ఎక్కడా ఏ అధ్యయనమూ నిరూపించలేదు. అయితే నెయ్యి తినడం వల్ల మాత్రం చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి. 


శతాబ్ధాలుగా సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో నెయ్యిని ఉపయోగిస్తున్నారు. గర్భిణీ స్త్రీలతో సహా అందరూ నెయ్యి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవచ్చు. అలాగని అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. రోజుకో స్పూన్ నెయ్యి తింటే చాలు, అందులోని ఆరోగ్య లాభాలు శరీరానికి అందుతాయి.


1. నెయ్యిలో విటమిన్లు ఏ, డి, ఈ, కే ఉన్నాయి. ఇది గర్భధారణ సమయంలో పిండానికి మేలు చేస్తాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. తక్షణమే శక్తిని అందిస్తాయి. గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఇవి తోడ్పడుతాయి. కాబట్టి గర్భిణీలు నెయ్యిని తినడం మంచిది. 


2. నెయ్యి శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. గర్భధారణ సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వాటిని సరి చేయడంలో నెయ్యిలోని పోషకాలు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ఎండోక్రైన్ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడతాయి.


3. ఆయుర్వేదంలో నెయ్యిని జీర్ణశక్తిని పెంచేదిగా చెబుతారు. జీర్ణాశయ అగ్నిని ఉత్తేజపరిచి జీవక్రియ ఆరోగ్యకరంగా జరిగేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో నెయ్యిని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. 


పిల్లలకు నెయ్యిని రోజూ తినిపించడం వల్ల వారిలో తెలివి తేటలు పెరుగుతాయి. ఆహారం తినాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది.




Also read: వ్యక్తి మరణించే ముందు ఒక్కొక్కటిగా ఈ లక్షణాలను కోల్పోతూ ఉంటాడు - స్టాన్‌‌ఫొర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.