IPL 2023: ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది వరుసగా రెండో విజయం. ప్రస్తుతం ఆ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండిట్లో గెలిచింది.
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ఢిల్లీ రెండు పాయింట్లు, -1.183 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో ఉంది. అయితే హైదరాబాద్‌పై ఈ విజయం తర్వాత కూడా జట్టు నాలుగు పాయింట్లు, -0.961 నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అదే సమయంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినా జట్టు స్థానంలో ఎలాంటి మార్పు లేదు. ఓటమి తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు పాయింట్లు, -0.725 నెట్ రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానంలోనే ఉంది.
పాయింట్ల పట్టికలో టాప్ 5 జట్లు ఇవే
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాల ద్వారా, 10 పాయింట్లు సాధించింది. +0.662 నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. 8 పాయింట్లు, +0.844 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది.
ఇక ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో లక్నో సూపర్‌జెయింట్స్ మూడో స్థానంలో ఉంది. వారికి 8 పాయింట్లు, +0.547 నెట్ రన్‌రేట్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. ఎనిమిది పాయింట్లు, +0.212 నెట్‌రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. వీరి నెట్ రన్‌రేట్ -0.008గా ఉంది.
ఇది మిగతా జట్ల పరిస్థితి
పాయింట్ల పట్టికలో, పంజాబ్ కింగ్స్ 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 9, 10 స్థానాల్లో నిలిచాయి.
ఐపీఎల్ 2023 సీజన్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులకు పరిమితం అయింది. దీంతో ఢిల్లీకి టోర్నీలో వరుసగా రెండో విజయం దక్కింది. సన్‌రైజర్స్‌కు మాత్రం వరుసగా మూడో ఓటమి.
సన్‌రైజర్స్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (49: 39 బంతుల్లో, ఏడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ (31: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు) చివర్లో పోరాడారు. హ్యారీ బ్రూక్ (7: 14 బంతుల్లో), రాహుల్ త్రిపాఠి (15: 21 బంతుల్లో), ఎయిడెన్ మార్క్రమ్ (3: 5 బంతుల్లో), అభిషేక్ శర్మ (5: 5 బంతుల్లో) దారుణంగా విఫలం అయ్యారు. ఢిల్లీ బ్యాటర్లలో మనీష్ పాండే (34: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), అక్షర్ పటేల్ (34: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు.