వెల్లుల్లి వేయకుండా భారతీయ కూరలు పూర్తి కావు. అది ఏ కూరైనా కచ్చితంగా వెల్లుల్లి పడాల్సిందే. రసం, వేపుళ్లలో కూడా రెండు వెల్లుల్లి రెబ్బలు వేయాల్సిందే. అప్పుడే మంచి టేస్టు. కేవలం రుచే కాదు, వాటి వల్ల ఆరోగ్యం కూడా. రెబ్బల రూపంలో లేదా పేస్టు రూపంలో దీన్ని వాడతారు. వెల్లుల్లి తరుగు నూనెలో వేపితేనే నోరూరించే వాసన వచ్చేస్తుంది. అందుకే వెల్లుల్లికి క్రేజ్ ఎక్కువ. దీనిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువ.జలుబు, దగ్గు ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి దట్టించిన సూప్ తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వెల్లుల్లిలో ఎక్కువ. అయితే చలికాలంలో దీన్ని అధికంగా తినే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో వెల్లుల్లి తినడాన్ని తగ్గించాలి.
ఈ సమస్యలుంటే..
1. అసిడిటీ సమస్య ఉన్న వ్యక్తులు
2. శరీర దుర్వాసన బాధపడేవారు
3. రక్తం పలుచన చేసే మందులు వాడుతున్నవారు
4. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ స్టాటిన్స్ వాడుతున్న వారు
5. జీర్ణ వ్యవస్థ వీక్‌గా ఉన్న వారు
పైన చెప్పిన సమస్యలు ఉన్న వారు కచ్చితంగా వెల్లుల్లి చలికాలంలో తినడం తగ్గించాలి.
మిగతావారు?
పైన చెప్పిన సమస్యలు లేని వారు వెల్లుల్లి రోజూ తింటే చాలా మంచిది. ఇది ఎంతో ఆరోగ్యకరమైన పదార్థం. దీన్ని రోజూ తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ నుంచి గుండె వరకు ప్రతి అవయవానికి ప్రయోజనం కలుగుతుంది. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే...
1. అంటువ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది.
2. అధిక రక్తపోటును తగ్గిస్తుంది
3. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
4. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
వెల్లుల్లిని రోజుకు రెండు రెబ్బలు పచ్చివి తింటే ఇంకా మంచిది. వాటిని కాల్చడం, డీప్ గా వేయించడం వల్ల వాటిలో శక్తి సమ్మేళనాలు నశిస్తాయి. రసంలో, పప్పులో, కూరల్లో వేసుకుని తింటే అందులోని పోషకాలు అందుతాయి.
Also read: డయాబెటిస్ ఉంటే మందులు వాడాల్సిందేనా? వాడకుండా అదుపులో ఉంచలేమా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.