తల్లి కావడమే మధురానుభూతి. బిడ్డకు అయిదారు నెలలు వచ్చే వరకు తల్లి తన గురించి పట్టించుకునే తీరిక ఉండదు. ఆరు నెలలు దాటాక పిల్లలు చుట్టు పక్క పరిసరాలను చూడడం, బొమ్మలను చేత్తో పట్టుకుని ఆడడం వంటివి ఎంజాయ్ చేస్తారు. అప్పట్నించి తల్లికి కాస్త విరామం దొరుకుతుంది. కానీ ప్రసవం  అయ్యి బిడ్డకు ఆరు నెలలు దాటినప్పటి నుంచి జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. కుచ్చులుకుచ్చులుగా ఊడిపోతున్న జుట్టుని చూస్తే ఎవరికి మాత్రం బాధనిపించదు? తల్లులు కూడా అంతే. అయితే వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ సహజంగా జరిగేదే. తిరిగి మళ్లీ బలం పుంజుకుని జుట్టు ఎదగడం ప్రారంభమవుతుంది. 


ఎందుకు ఊడుతుంది?
గర్భాధారణ సమయంలో తల్లి శరీరంలో ముఖ్యమైన హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, అలాగే రక్తం అధికస్థాయిలో ఉంటాయి. అందుకే ఆ సమయంలో తల్లి జుట్టు పట్టుకుచ్చులా మారిపోతుంది. చక్కగా ఎదుగుతుంది. ప్రసవం అయ్యాక మాత్రం వాటి స్థాయిలు తగ్గుతాయి. అందుకే వెంట్రుకలు కూడా రాలిపోతాయి. సాధారణంగానే తలపై ఉన్న వెంట్రుకల్లో 85 నుంచి 90 శాతం వెంట్రుకలు ఎదుగుతూ ఉంటాయి. మిగతావి మాత్రం విశ్రాంతి దశలో ఉంటాయి. అంటే అవి ఇక ఎదగవన్న మాట. అలంటివే దువ్వినప్పుడు రాలిపోతుంటాయి. గర్భధారణ సమయంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు బాగా పెరుగుతుంది. ప్రసవం అయిన రెండు మూడు నెలల వరకు పరిస్థితి అలాగే ఉంటుంది. తరువాత మాత్రం తిరిగి రక్తప్రసరణ సాధారణ స్థితికి వస్తుంది.హార్మోన్ల స్థాయిలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి వెంట్రుకలు ఊడిపోవడం మొదలవుతుంది.కాబట్టి దీన్ని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఊడాక మళ్లీ పెరగడం మొదలువుతుంది. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. జుట్టు అధికంగా రాలిపోతున్నప్పుడు మరీ గట్టిగా దువ్వకండి. నెమ్మదిగా దువ్వాలి. 
2. రోజుకు ఒకటి కన్నా ఎక్కువ సార్లు దువ్వకూడదు. 
3. ఆహారం విషయంలో మార్పులు చేయాలి. క్యారెట్లు, చిలగడదుంపలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు బాగా తినాలి. 
4. జుట్టుకి నూనె పెట్టి పోషణ బాగా చేయాలి. 
5. షాంపూ పెట్టాక నీటితో కడిగేసుకుని, తరువాత హెయిర్ కండిషనర్ గా కూడా పెడితే జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. వెంట్రుకలు పట్టులా మారుతాయి. 


Also  read: మహిళలూ పుట్టగొడుగులు తింటున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే



Also  readశరీర దుర్వాసన ఎక్కువైందా? మీరు తినే ఈ ఆహారమే కారణం


Also read: డయాబెటిస్ రీడింగులు ఎంత మోతాదు దాటితే మందులు వేసుకోవడం ప్రారంభించాలి?