ప్రపంచ జనాభాలో అధిక శాతం మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఏకంగా 50 కోట్ల మందికి పైగా జనం డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మనదేశంలో కూడా ఏడుకోట్లకు మందికి పైగా డయాబెటిస్ తో సతమతమవుతున్నారు. వారిలో చాలా మందికి డయాబెటిస్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియవు. మరొకొందరికి మధుమేహం ఎంత మోతాదు (రీడింగులు) దాటితే ప్రమాదకరమో, ఎంత రీడింగు  దాటితే మందులు వాడాలో కూడా తెలియదు. ఆ విషయాంపై అవగాహన కల్పించే కథనమే ఇది. 


ఉపవాసంతో...
డయాబెటిస్ నిర్ధారణలో రక్తంలో గ్లూకోజు మోతాదులే  ముఖ్యం. రాత్రి అన్నం తిన్నాక ఉదయం వరకు ఏమీ తినకుండా ఉండాలి. మధ్య మధ్యలో కాస్త నీళ్లు తాగొచ్చు. అలా 10 నుంచి 12 గంటలు ఆహారం తినకుండా ఉన్నాక ఉదయం టెస్టు చేయించుకోవాలి. ఈ పరీక్షలో రక్తంలో గ్లూకోజు 100 మి.గ్రా దాటి వస్తే మీరు ప్రీ డయాబెటిక్ అని అర్థం. అంటే మీరు మధుమేహులుగా మారడానికి దగ్గరగా ఉన్నట్టు. ఆహారం ద్వారా నియంత్రించుకుంటే డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే 125 మి.గ్రా దాటి వస్తే మీరు డయాబెటిస్ అని అర్థం. ఆ రీడింగు దాటితే వైద్యులను సంప్రదించి అవసరమైతే ఆహారంలో మార్పులే కాదు మందులు కూడా వాడాల్సి ఉంటుంది.


భోజనం చేశాక
టిఫిన్, లేదా అన్నం పొట్ట నిండా తిన్నాక రెండు గంటలు తరువాత మళ్లీ టెస్టు చేయించుకోవాలి. అందులో రక్తంలో గ్లూకోజు ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. 200 మి.గ్రా మించి వస్తే మాత్రం కచ్చితంగా మందులు వాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మధుమేహం ఇతర అవవయాలు కూడా దెబ్బతినడం, పనితీరు మార్చుకోవడం వంటివి చేస్తాయి. మొదట్నించే మందులు వాడడం వల్ల శరీరంపై పడే చెడు ప్రభావాలు తగ్గుతాయి. మందులు ఆలస్యమైతే కిడ్నీలపై అధికంగా ప్రభావం పడొచ్చు. 


ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే మీరు గుర్తిస్తే మందులు వాడాల్సిన అవసరం లేకుండానే జీవించవచ్చు. కాకపోతే ఆహారం మాత్రం మార్పులు చేసుకోవాలి. స్వీట్లు, ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు, బ్రౌన్ రైస్, చేపలు వంటివి అధికంగా తినాలి. నడక ద్వారా మధుమేహం బాగా కంట్రోల్ లో ఉంటుంది. రోజూ కనీసం అరగంట చాలా వేగంగా నడవాలి. 


Also read: మ్యుటేషన్ చెందుతున్న జికా వైరస్, ఎప్పుడైనా ప్రపంచంపై విరుచుకుపడే అవకాశం, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు


Also read: ఇవన్నీ ఆహార ఫోబియాలు, మీకున్నాయేమో చెక్ చేసుకోండి