ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని సాధించింది. శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 16 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 173 పరుగులకే పరిమితం అయింది. దీంతో విజయం బెంగళూరును వరించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.


ఆదుకున్న దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం అయింది. టాప్-3 బ్యాటర్లు ఫాఫ్ డుఫ్లెసిస్ (8: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), అనూజ్ రావత్ (0: 1 బంతి), విరాట్ కోహ్లీ ( 12: 14 బంతుల్లో, ఒక ఫోర్) ముగ్గురూ ఘోరంగా విఫలం అయ్యారు. ఆ తర్వాత ప్రభుదేశాయ్ (6:4 బంతుల్లో, ఒక ఫోర్) కూడా అవుటయ్యాడు. అయితే మరోవైపు మ్యాక్స్‌వెల్ (55: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడటంతో వికెట్లు పడుతున్నా స్కోరు పరుగులు పెట్టింది. అయితే ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను కూడా కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడంతో బెంగళూరు 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఈ దశలో బెంగళూరును దినేష్ కార్తీక్ (66 నాటౌట్: 34 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు), షాబాజ్ అహ్మద్ (32 నాటౌట్: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ఆదుకున్నారు. మొదట నిదానంగా ఆడినా... తర్వాత దినేష్ కార్తీక్ స్కోరుబోర్డును సిక్సర్లతో పరిగెత్తించాడు. తనకు షాబాజ్ అహ్మద్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఆరో వికెట్‌కు వీరిద్దరూ అజేయంగా 97 పరుగులు జోడించారు. కేవలం 52 బంతుల్లోనే వీరు ఈ భాగస్వామ్యాన్ని నిర్మించడం విశేషం. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు జోడించింది. బెంగళూరు బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.


అడ్డుకున్న బెంగళూరు బౌలర్లు
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి ప్రారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా (16: 13 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), డేవిడ్ వార్నర్ (66: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. పృథ్వీ షా అవుటయినా వార్నర్ తన జోరు ఏమాత్రం తగ్గించలేదు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే మరో ఎండ్‌లో మిషెల్ మార్ష్ (14: 24 బంతుల్లో) ఇబ్బంది పడటంతో వార్నర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో వనిందు హసరంగ బౌలింగ్‌లో స్విచ్ హిట్‌కు ప్రయత్నించి వార్నర్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 94 పరుగులు మాత్రమే.


ఆ తర్వాత మిషెల్ మార్ష్, రొవ్‌మన్ పావెల్ (0: 1 బంతి), లలిత్ యాదవ్ (1: 4 బంతుల్లో) కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ 15 ఓవర్లలో 115 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికి ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 75 పరుగులు కావాలి. ఈ దశలో రిషబ్ పంత్ (34: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడటంతో ఢిల్లీ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రిషబ్ పంత్ అవుటయ్యాడు. రెండు సిక్సర్లతో ఊరించిన శార్దూల్ ఠాకూర్ (17: 9 బంతుల్లో, రెండు సిక్సర్లు) కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరూ అవసరం అయినంత వేగంగా ఆడలేకపోవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులకే పరిమితం అయింది.


Also Read: అయ్యయ్యో డీఫీట్‌ నంబర్‌ 6 - ముంబయిని ఓడించేసిన రాహుల్‌ సేన