IPL 2022 lsg won the match by 18 runs against mi in match 26 brabourne stadium: ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) అస్సలు కలిసిరావడం లేదు. 15వ సీజన్లో వరుసగా ఆరో మ్యాచులోనూ ఓటమి చవిచూసింది. ఒత్తిడికి చిత్తయింది. ఎలా గెలవాలో తెలియక అవస్థ పడుతోంది. లక్నో సూపర్‌జెయింట్స్‌ (Lucknow Supergiants) నిర్దేశించిన 200 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 181/9 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (37; 27 బంతుల్లో 3x4), డీవాల్డ్‌ బ్రూవిస్‌ (31; 13 బంతుల్లో 6x4, 1x6), కీరన్‌ పొలార్డ్‌ (25; 14 బంతుల్లో 1x4, 2x6 టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు లక్నోలో కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ (103*; 60 బంతుల్లో 9x4, 5x6) సెంచరీ చేశాడు. మనీశ్‌ పాండే (38; 29 బంతుల్లో 6x4), క్వింటన్‌ డికాక్‌ (24; 13 బంతుల్లో 4x4, 1x6) రాణించారు.


ఆఖరి వరకు ముంబయి టెన్షన్‌


భారీ లక్ష్య ఛేదనకు ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్‌కు కోరుకున్న ఓపెనింగ్‌ రాలేదు. జట్టు స్కోరు 16 వద్దే అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ (6) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బేబీ ఏబీ 'డీవాల్డ్‌ బ్రూవిస్‌' మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వరుస బౌండరీలు, సిక్సర్లు దంచడంతో రెండో వికెట్‌కు 19 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం లభించింది. 5.5వ బంతికి అతడిని అవేశ్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే ఒత్తిడిలో ఉన్న ఇషాన్‌ కిషన్‌ (13)స్టాయినిస్‌ వేసిన 6.2వ బంతికి వికెట్‌ ఇచ్చేస్తాడు. 57/3తో కష్టాల్లో పడ్డ ఈ సిచ్యువేషన్‌లో తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ (26; 26 బంతుల్లో 2x4)తో కలిసి సూర్యకుమార్‌ యాదవ్‌ నిలకడగా ఆడాడు. వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. 48 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కీలకంగా మారిన ఈ జోడీని తిలక్‌ను ఔట్‌ చేయడం ద్వారా హోల్డర్‌ విడదీశాడు. అప్పటికి స్కోరు 121. మరో 6 పరుగులకే రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ ఔటవ్వడంతో టెన్షన్‌ పెరిగింది. జయదేవ్‌ ఉనద్కత్‌ (14; 6 బంతుల్లో 2x4, 1x6) కీరన్‌ పొలార్డ్‌ భారీ బౌండరీలతో భయపెట్టినా లక్నో బౌలర్లు పరుగుల్ని నియంత్రించి ముంబయిని ఓడించేశారు.


 



KLass సెంచరీ


వేలంలో చేసిన పొరపాట్లు ముంబయి ఇండియన్స్‌ను పదేపదే వెంటాడుతున్నాయి. మంచి బౌలర్లు లేకపోవడం ఆ జట్టు గెలుపు అవకాశాలను దెబ్బతీస్తోంది. పైగా ఈరోజు ముంబయి ఫీల్డింగ్‌ మరీ చెత్తగా ఉంది. వీటన్నిటికీ లక్నో అందిపుచ్చుకుంది. తొలి మూడు ఓవర్లు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌ ఆచితూచి ఆడుతూనే బౌండరీలు బాదేశారు. ఆ తర్వాత మూడు ఓవర్లు షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఈజీగా 50 దాటేసింది. జట్టు స్కోరు 52 వద్ద ఫాబియన్‌ అలెన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడిన డికాక్‌ ఎల్బీ అయ్యాడు.


వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్‌ పాండే మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా చక్కగా బౌండరీలు బాదడంతో 2వ వికెట్‌కు 47 బంతుల్లో 72 పరుగులు భాగస్వామ్యం వచ్చింది. జోరు పెంచే క్రమంలో మురుగన్‌ అశ్విన్‌ గూగ్లీగా వేసిన 13.2 బంతికి పాండే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అయితే రాహుల్‌ మాత్రం జోరు ఆపలేదు. 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఓవర్లు గడిచే కొద్దీ తన అందమైన ఆటను బయట పెట్టాడు. సిక్సర్లు, బౌండరీలు కొట్టాడంతో 15 ఓవర్లకు స్కోరు 150కి చేరుకుంది. ఇదే ఊపులో 56 బంతుల్లో సెంచరీ కొట్టి వందో ఐపీఎల్‌ మ్యాచులో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడుగా నిలిచాడు. దాంతో లక్నో 199/4తో నిలిచింది.