IPL 2022, MI vs LSG: ఐపీఎల్‌ 2022లో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ అదరగొడుతోంది. 28వ మ్యాచులో భారీ స్కోరు చేసింది. ఐదుసార్లు ఛాంపియన్‌కు ముంబయి ఇండియన్స్‌కు 230 పరుగులు భారీ టార్గెట్‌ ఇచ్చింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (103*; 60 బంతుల్లో 9x4, 5x6) తన వందో మ్యాచులో రెచ్చిపోయాడు. వైవిధ్యమైన షాట్లతో అలరించాడు. సెంచరీ నమోదు చేశాడు. అతడికి తోడుగా మనీశ్‌ పాండే (38; 29 బంతుల్లో 6x4), క్వింటన్‌ డికాక్‌ (24; 13 బంతుల్లో 4x4, 1x6) రాణించారు.









వేలంలో చేసిన పొరపాట్లు ముంబయి ఇండియన్స్‌ను పదేపదే వెంటాడుతున్నాయి. మంచి బౌలర్లు లేకపోవడం ఆ జట్టు గెలుపు అవకాశాలను దెబ్బతీస్తోంది. పైగా ఈరోజు ముంబయి ఫీల్డింగ్‌ మరీ చెత్తగా ఉంది. వీటన్నిటికీ లక్నో అందిపుచ్చుకుంది. తొలి మూడు ఓవర్లు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌ ఆచితూచి ఆడుతూనే బౌండరీలు బాదేశారు. ఆ తర్వాత మూడు ఓవర్లు షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఈజీగా 50 దాటేసింది. జట్టు స్కోరు 52 వద్ద ఫాబియన్‌ అలెన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడిన డికాక్‌ ఎల్బీ అయ్యాడు.


వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్‌ పాండే మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా చక్కగా బౌండరీలు బాదడంతో 2వ వికెట్‌కు 47 బంతుల్లో 72 పరుగులు భాగస్వామ్యం వచ్చింది. జోరు పెంచే క్రమంలో మురుగన్‌ అశ్విన్‌ గూగ్లీగా వేసిన 13.2 బంతికి పాండే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అయితే రాహుల్‌ మాత్రం జోరు ఆపలేదు. 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఓవర్లు గడిచే కొద్దీ తన అందమైన ఆటను బయట పెట్టాడు. సిక్సర్లు, బౌండరీలు కొట్టాడంతో 15 ఓవర్లకు స్కోరు 150కి చేరుకుంది. ఇదే ఊపులో 56 బంతుల్లో సెంచరీ కొట్టి వందో ఐపీఎల్‌ మ్యాచులో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడుగా నిలిచాడు. దాంతో లక్నో 199/4తో నిలిచింది.