IPL 2022 mi vs lsg mumbai indians struggles to facing Ravi Bishnoi vs lucknow supergiants: ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు చావోరేవో! ఆదివారం బ్రబౌర్న్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants)తో ఆరో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచులో ఓడిపోతే హిట్‌మ్యాన్ సేన పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. వరుసగా ఎనిమిది మ్యాచులు గెలవాల్సి వస్తుంది. ఇక చావోరేవోగా భావించే నేటి మ్యాచులో ముంబయి (MI)కి గూగ్లీ భయం పట్టుకుంది. ఓ చిన్న కుర్రోడు సీనియర్ బ్యాటర్లను వణికించేస్తున్నాడు.
లక్నోతో మ్యాచులో మిస్టరీ యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఎదుర్కోవడం ముంబయి ఇండియన్స్‌కు సవాల్‌గా మారింది. అతడు వేగంగా విసిరే గూగ్లీతో ప్రత్యర్థులు భయపడుతున్నారు. అటు పరుగుల్ని నియంత్రించడమే కాకుండా వికెట్లు తీస్తుండటంతో ఆచితూచి ఆడాల్సి వస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, కీరన్ పొలార్డ్ రాణించడం ముంబయికి అత్యవసరం. బిష్ణోయ్‌పై ఈ నలుగురిలో కేవలం ఇషాన్‌కు మాత్రమే అత్యధిక స్ట్రైక్‌రేట్ ఉంది. అదీ 118. రోహిత్, కిషన్‌ను ఒకసారి పెవిలియన్ పంపించిన బిష్ణోయ్ సూర్యకుమార్‌ను రెండుసార్లు ఔట్ చేశాడు. పైగా అతడి స్ట్రైక్‌రేట్ 89 మాత్రమే.
బిష్ణోయ్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్ ఇప్పటి వరకు ఔటవ్వలేదు కానీ అతడు రాగానే నెమ్మదించేస్తాడు. కేవలం 79 స్ట్రైక్‌రేట్‌తో ఆడతాడు. పైగా మిస్టరీ స్పిన్నర్ల బలహీనత ఉంది అతడికి. ముంబయి టాప్ ఆర్డర్లో రోహిత్, కిషన్, సూర్య ఉంటారు. మిడిలార్డర్లో పొలార్డ్ వచ్చేస్తాడు. అంటే పవర్‌ప్లే నుంచే బిష్ణోయ్‌ను లక్నో రంగంలోకి దింపుతుంది అనడంలో సందేహం లేదు. కచ్చితంగా అతడిని సమర్థంగా ఎదుర్కొంటేనే ముంబయికి విజయావకాశాలు ఉంటాయి. మరి అతడిని ఎలా కాచుకుంటారో చూడాల్సిందే.
మరోవైపు టీ20ల్లో బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్ ఇప్పటి వరకు క్వింటన్ డికాక్‌ను ఔట్ చేయలేదు. పైగా వారిపై అతడి స్ట్రైక్‌రేట్ వరుసగా 173, 153, 145గా ఉంది. బుమ్రా కూడా అతడిని ఇప్పటి వరకు ఔట్ చేయలేదు.