బరువు తగ్గడం నుంచి, అందాన్ని పెంచుకోవడం వరకు అన్ని రకాల డైట్‌లలో తేనే కచ్చితంగా ఉంటుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల జాబితా చాలా పెద్దది. పిల్లలకు ఎంతో ఇష్టమైన తీపి రుచి ఇది. తేనెలో బ్రెడ్డు ముక్కను ముంచిపెట్టిన ఆనందంగా తినేస్తారు. ఎంతో మంది పరగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. మరికొందరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం రోజు ఒక స్పూను తేనెను ఆరగిస్తారు. ఎలా చూసినా, తేనె వల్ల లాభమే కానీ నష్టం లేదు. అందుకే ఇది ముఖ్యమైన ఆహార పదార్థాలలో ఒకటిగా మారింది.


తేనె చరిత్రను చూస్తే అది ఈనాటిది కాదని తెలుస్తుంది. వేల సంవత్సరాల నుంచి కూడా పాడవకుండా ఉన్న తేనె కుండలు పరిశోధకుల కంట పడ్డాయి. పురాతన నాగరికత అవశేషాలను వెతికే క్రమంలో ఈ తేనె కుండలను వారు కనిపెట్టారు. ముఖ్యంగా ఈజిప్టు సమాధుల్లో మూడు వేల ఏళ్లనాటి తేనె డబ్బాలు కూడా బయటపడ్డాయి. వాటి రుచి చూస్తే చాలా స్వచ్ఛంగా, తాజాగా ఉండడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. అందుకే తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదని చెబుతారు.


ఎందుకు పాడవదు?
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనగర్తలు తేనె ఎందుకు పాడవతో తెలుసుకోవడం కోసం పరిశోధనలు చేశారు.  స్వచ్ఛమైన తేనెలో తేమశాతం సున్నా. తేమ లేని చోట బ్యాక్టీరియా, వైరస్ పెరగలేదు. అందుకే తేనెలో ఏ బ్యాక్టీరియా గాని, వైరస్ గాని ఉండవు. దాని కారణంగా అది చెడిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది. ఇదంతా చెబుతున్నది స్వచ్ఛమైన తేనె గురించి. కల్తీ తేనెలలో మాత్రం తేమ ఉంటుంది.కాబట్టి అవి పాడైపోతాయి. తేనె పాడయిందంటే అర్థం అది కల్తీదని.


తేనె ఎలా తయారవుతుంది?
ఈ పరిశోధనలోనే తేనె తయారు చేసే విధానాన్ని కూడా శాస్త్రవేత్తలు దగ్గరుండి పరిశీలించారు. తేనెటీగలు ప్రతి పువ్వు మీద వాలి పుప్పొడిని సేకరిస్తాయి. ఈ పుప్పొడిలో 60 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది. ఆ పుప్పొడిని తేనెగా మార్చే క్రమంలో తేనెటీగలు ఆ తేమనంతటిని తొలగించేస్తాయి. మిగిలిన భాగం తేనెగా మారుతుంది. అందుకే ఘనతంతా తేనెటీగలకే ఇవ్వాలి.


తేనె తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ముందే చెప్పుకున్నాము. ఇది ఒక అద్భుతమైన క్రిమినాశకమందు. ఎందుకంటే తేనెలో జీవం బతకలేదు. అందుకే దీన్ని తినమని సూచిస్తారు వైద్యులు. ఈజిప్షియన్ నాగరికతలో తేనెను కంటి, చర్మ సంబంధిత వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగించేవారు. ఎన్నో అనేక ప్రభావవంతమైన మందులు తయారు చేయడానికి అప్పట్లో వాడేవారు. 



Also read: పెరుగు-పంచదార కలుపుకొని తినే అలవాటు మీకుందా? అదెంత హానికరమో తెలుసుకోండి


































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.