మెంతులు చేదుగా ఉంటాయి, అందుకే తినేందుకు ఎవరూ ఇష్టపడరు. వాటిని నేరుగా తినడం కష్టం కానీ కూరలోనో, బిర్యానీలో, పలావులోనో పొడిలా చేసి వాడేసుకోవచ్చు. రుచి కూడా పెద్దగా మారదు. ఎలాగోలా మెంతులు శరీరంలో చేరితే చాలు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని శతాబ్ధాలుగా భారతీయ వంటకాల్లో మెంతికూర భాగమైపోయింది.ఇది శరీరం మొత్తానికి, చర్మం, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మగవారికి మెంతులు తినడం చాలా అవసరం. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోను చాలా ముఖ్యమైనది. అదే వారి లైంగిక శక్తిని,చర్యను పెంచుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోను సరిగా పనిచేయకపోయినా,తగినంత ఉత్పత్తి కాకపోయినా కూడా మగవారిలో లైంగిక పటుత్వం తగ్గిపోతుంది. దీని వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే వారు మెంతులను,మెంతి ఆకులను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. 


వీరికీ మేలే
పిల్లలకు పాలు పెట్టే తల్లులకు మెంతులు చేసే మేలు ఇంతా అంతాకాదు. ఏదో ఒక రకంగా మెంతులను వారు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది. వారిలో పాల ఉత్పత్తిని పెంచుతాయి. మెంతులు కలిసిన పాలు తాగడం వల్ల చంటి పిల్లల్లో కూడా ఎదుగుదల బావుంటుంది. మెంతులుతో అప్పుడప్పుడు టీ చేసుకుని తాగితే మంచిది. అలాగే మధుమేహంతో బాధపడేవారికి కూడా మెంతులు ఎంతో మంచివి. వీటిని క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే కొన్ని రోజుల్లోనే మధుమేహం నియంత్రణలోకి వచ్చేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది గ్లోకోజ్ విచ్ఛిన్నం చేసి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 


అధిక బరువు తగ్గాలనుకునే వారు కూడా మెంతులను రోజూ తినాలి. ఇవి ఆకలిని తగ్గించడంతో పాటూ కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. వీటిని తరచూ తినడం వల్ల అజీర్తి సమస్యలు రావు. గుండెల్లో మంట వంటివి నయం అవుతాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది ముందుంటుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. 


మెంతులను ఇలా తినండి..
మెంతి గింజలను ఎలా ఆహారంలో భాగం చేసుకోవాలో ఆలోచిస్తున్నారా? వాటిని నేరుగా తిన్నా, నీళ్లలో నానబెట్టుకుని తిన్నా చాలా చేదుగా ఉంటాయి. కాబట్టి పచ్చళ్లు, కూరలు చేసుకునేటప్పుడు మెంతి పొడిని చల్లుకోండి. అన్నింట్లోనూ ఇలా కలుపుకుంటే  శరీరంలో మెంతి చేరుకుంటుంది. ఆరోగ్యపరంగా ఈ గింజలు చాలా మేలు చేస్తాయి. 


Also read: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం


Also read: ఆరోగ్యకరమైన చిరుతిండి క్యాప్సికమ్ రింగ్స్, ఇలా చేస్తే కరకరలాడతాయి












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.