వర్షాకాలం వచ్చిందంటే చాలు పకోడీలు, ఆనియన్ రింగ్స్, మిర్చీ బజ్జీలు, బోండాలు నూనెలో సలసల కాగుతుంటాయి. సాయంత్రం వచ్చిందంటే వేడివేడి చిరుతిళ్లు పొట్టలో పడాల్సిందే. ఎప్పుడూ తినే బోండాలు, బజ్జీలే కాకుండా కొత్తవి ప్రయత్నించండి. ఆనియన్ రింగ్స్ చేసుకుంటే రుచి కొత్తగా ఉంటుంది. పైగా క్యాప్సికమ్ ఆరోగ్యం కూడా. కాబట్టి ఈసారి ఈ రెసిపీ చేసి చూడండి.

  


కావాల్సిన పదార్థాలు
క్యాప్సికమ్ (చిన్నవి) - నాలుగు
బియ్యప్పిండి - పావు కప్పు
శెనగపిండి - ఒక కప్పు
బేకింగ్ సోడా - చిటికెడు
అల్లంవెల్లుల్లి పేస్టు - పావు టీస్పూను
నీళ్లు - కలపడానికి సరిపడా
కారం - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా


తయారీ ఇలా 
1. క్యాప్సికమ్ చిన్న పరిమాణంలో ఉన్నవి ఎంచుకోవాలి. అప్పుడే వాటిని అడ్డంగా కోస్తే చక్రాల్లా వస్తాయి. 
2. ఒక గిన్నె తీసుకుని శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. 
3. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, బేకింగ్ సోడా కూడా వేయాలి. 
4. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. 
5. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేయాలి. 
6. కళాయిలో నూనె బాగా వేడెక్కాక క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని వేయించాలి. 
7. వర్షం పడే సాయంత్రం వీటిని వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. 
ముఖ్యంగా పిల్లలకు ఇవి చాలా బాగా నచ్చుతాయి. క్యాప్సికమ్ తినని పిల్లలకు ఇలా రింగ్స్ లా వేయించి ఇస్తే ఆ కూరగాయ తినిపించినట్టు ఉంటుంది. 


క్యాప్సికమ్ తినడం వల్ల ప్రయోజనాలు
ఆకుపచ్చని క్యాప్సికం తినకుండా పక్కన పడేసే వారే ఎక్కువ. పిజ్జాలో వచ్చినా కూడా పక్కన పడేసి మిగతాది తింటారు. నిజానికి దీన్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తరచూ తినడం వల్ల సహజ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. దీనిలో కేయాన్ అనే మూలకం ఉంటుంది. దీని వల్లే అది పెయిన్ రిలీప్ గా పనిచేస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి కాపాడతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డయేరియా, అల్సర్లను రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. క్యాప్సికమ్ తినడం వల్ల విటమిన్ ఎ కూడా లభిస్తుంది. ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికం కూర లేదా దానితో చేసిన ఇతర వంటకాలు ఏవైనా వారానికి కనీసం మూడు రోజులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభం. క్యాన్సర్ నివారణలో కూడా ఇది ముందుంటుంది. తరచూ క్యాప్సికం తినే వారిలో క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. కంటిలో శుక్లాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. దీనిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ చాలా అవసరం. 


Also read: నా పెళ్లికి రండి, విందుకు డబ్బులు చెల్లించండి, కాబోయే వధువు వెరైటీ అతిధి పిలుపు



Also read: భారతదేశంలో పెరిగిపోతున్న బ్రెయిన్ అనూరిజం మరణాలు, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు