చాలా మందికి తలనొప్పి తరచూ వేధిస్తుంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని సర్దుకుపోతారు. నిజానికి తలనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. తలనొప్పి రావడానికి కారణాలు కూడా అనేకం ఉంటాయి. వాటి మూలాలను తెలుసుకుంటే చికిత్స కూడా సులువవుతుంది. తలనొప్పుల్లో ఒక రకం ‘ఐస్‌క్రీము తలనొప్పి’. దీన్నే బ్రెయిన్ ఫ్రీజ్ అని కూడా అంటారు. చాలా మందిలో ఇది కలుగుతుంది కానీ ఎందుకు వస్తుందో మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఏంటీ ఐస్‌క్రీము తలనొప్పి?
ఏదైనా చల్లని పానీయాలు లేదా ఆహారం తిన్నప్పుడు తలలో హఠాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటూ ఉండి పోతుంది. గొంతు, నోటిలోని ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ఫ్రీజ్‌ని కోల్డ్ స్టిమ్యులస్ తలనొప్పి లేదా స్ఫెనోపలటైన్ గ్యాంగ్లియోనెరల్జియా అని కూడా అంటారు. నోటిలోనిఎగువ అంగిలిని చాలా చల్లగా తాకినప్పుడు ఈ తలనొప్పి వస్తుంది. ఒక వ్యక్తి వేడి వాతావరణంలో నివసిస్తూ చాలా చల్లగా ఉన్న పదార్థం తినేటప్పుడు ఇది సంభవిస్తుంది.
మిగతా తలనొప్పులతో పోలిస్తే బ్రెయిన్ ఫ్రీజ్ తలనొప్పి త్వరగా వస్తుంది, అలాగే త్వరగా పోతుంది. మైగ్రేన్లు వంటి ఇతర తలనొప్పులు అనారోగ్యం, పొత్తికడుపులో నొప్పి, వికారం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అలాగే ఆ తలనొప్పులు వచ్చినప్పుడు అధిక కాంతిని చూడడం కూడా కష్టమవుతుంది. కానీ ఐస్‌క్రీము తలనొప్పిలో మాత్రం ఇలాంటి లక్షణాలు కనిపించవు. ఇలా వచ్చి అలా పోతుంది. ఐస్ క్రీములు తినేటప్పుడు ఇది వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి దీనికి ఐస్ క్రీము తలనొప్పి అని పేరు పెట్టారు.
ఈ తలనొప్పిని పోగొట్టుకోవడం ఎలా?
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం బ్రెయిన్ ఫ్రీజ్‌ను తగ్గించుకోవాలంటే వెంటనే కాస్త వేడి నీళ్లు తాగాలి. నోటిపై కప్పును లేదా అంగిలిని మీ నాలుకతో తాకుతూ ఉండాలి. కూల్ డ్రింకులు వంటివి తాగినప్పుడు అధికంగా నోట్లో వేసుకోకుండా, కొంచెం కొంచెం సిప్ చేయాలి.
ఈ తలనొప్పి వచ్చినప్పుడు తట్టుకోవడం కాస్త కష్టమే అయినా సెకన్లలో పోతుంది కాబట్టి పెద్ద ప్రమాదమేమీ లేదు. కాకపోతే వచ్చినంత సేపు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది.
Also read: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం
Also read: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?