డయాబెటిస్ బారిన పడడానికి ముందే ప్రీడయాబెటిస్ బారిన పడతారు ఎవరైనా. ఆ సమయంలో ఆహారం పరంగా జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి మధుమేహులుగా మారకుండా కాపాడుకోవచ్చు. ప్రీ డయాబెటిస్ బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలంటే కనీసం నెలరోజులకు ఒకసారైనా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అయితే ప్రీ డయాబెటిస్ కూడా అంత సురక్షితం కాదని చెబుతోంది కొత్త అధ్యయనం. సాధారణ యువతతో పోలిస్తే ప్రీడయాబెటిస్ తో బాధపడుతున్న యువత గుండెపోటు బారిన ప్రమాదం ఎక్కువని చెబుతోంది ఈ అధ్యయనం. సాధారణ యువతతో పోలిస్తే ప్రీ డయాబెటిక్ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. రాత్రి భోజనం చేశాక ఉదయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి షుగర్ టెస్టు చేయించుకోవాలి. అలా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100  mg/dL నుంచి 125 mg/dL మధ్య ఉంటే వారు ప్రీ డయాబెటిక్ రోగులని అర్థం. 100 mg/dL కన్నా తక్కువ ఉంటే వారు సాధారణ వ్యక్తులు, అంటే ఎలాంటి సమస్యా లేదని అర్థం. ఇక 125  mg/dL కి మించి ఉంటే వారికి మధుమేహం ఉన్నట్టే లెక్క. 


గుండె జబ్బులు అధికం
ప్రీ డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడిని కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలి. ముఖ్యంగా స్వీట్లు తినడం పూర్తిగా మానేయాలి. లేకుంటే అది అతి త్వరగా పూర్తి మధుమేహంగా మారిపోతుంది. అంతేకాదు ఆ వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది అని యుఎస్‌లోని మెర్సీ క్యాథలిక్ మెడికల్ సెంటర్‌లో రెసిడెంట్ ఫిజిషియన్ పనిచేస్తున్న అఖిల్ జైన్ అన్నారు. కొత్త పరిశోధనలో ఈయన కూడా భాగస్వాములే. ఇక ఈ అధ్యయనం ప్రకారం ప్రీడయాబెటిక్ యువతలో గుండెపోటుతో ఆసుపత్రిలో చేరే 1.7 రెట్లు అధికం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ యొక్క క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ అవుట్‌కమ్స్ రీసెర్చ్ సైంటిఫిక్ సెషన్స్ 2022లో ఈ అధ్యయనం తాలూకు ఫలితాలను వెల్లడించారు. 


ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 2018 నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన యువ రోగులు అంటే 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు వారి ఆరోగ్య రికార్డులను సమీక్షించారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన 7.8 మిలియన్ల మంది కన్నా ఎక్కువ మంది యువకులలో 31000 మంది పీ డయాబెటిస్ తో బాధపడుతున్నట్టు తేలింది. అయితే కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటంటే వీరికి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కార్డియాక్ అరెస్టు, స్ట్రోక్ వంటివి కలిగే అవకాశం తక్కువే అని చెబుతున్నారు పరిశోధకులు. 


ప్రీడయాబెటిక్ రోగులు చేయాల్సిందిదే
ప్రీడయాబెటిస్ రోగులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మానివేయాలి. ధూమపానం అలవాటును వెంటనే మానుకోవాలి. అధికబరువు ఉంటే వెంటనే తగ్గేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో ప్రీడయాబెటిస్ బారి నుంచి బయటపడవచ్చు.


Also read: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?


Also read: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే